మళ్లీ జాట్ల లొల్లీ

1

– హర్యానా సర్కారు హైఅలర్ట్‌

చండీగఢ్‌,జూన్‌ 5(జనంసాక్షి):దిల్లీ-హరియాణా సరిహద్దులో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తమ హావిూలను నెరవేర్చాలంటూ హరియాణా రాష్ట్రంలో జాట్‌ వర్గీయులు ఆదివారం నుంచి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో చేపట్టిన జాట్‌ ఆందోళన ప్రభావం దిల్లీపై పడటంతో ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నైరుతీ, వాయువ్య, ఆగ్నేయ దిల్లీలో నిషేదాజ్ఞలను అమలు చేశారు. రహదారులను, రైల్వే ట్రాక్‌లను ఆందోళనకారులు దిగ్భంధించకుండా పోలీసులు భారీగా మోహరించారు.దాదాపు 7వేల మంది పోలీసులు, ప్రత్యేక పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. మొదటి రోజు జాట్ల ఆందోళన ప్రశాంతంగానే ముగిసింది. దిల్లీకి నీరు వచ్చే మునాక్‌ కాలువను ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. గతంలో జరిగిన ఆందోళనలో జాట్లు మునాక్‌ కాలువ నుంచి దిల్లీకి నీరు రాకుండా అడ్డగించారు. చండీగఢ్‌లో 24 గంటల హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా 0172-2740390 ఈ నంబర్‌కు కాల్‌ చేయాల్సిందిగా ప్రకటించారు. సోనిపేట్‌, రోహతక్‌లో ఇప్పటికే ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.