మళ్లీ మోసం చేస్తే తెలంగాణ భగ్గుమంటది

– ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగుల పాత్ర కీలకం

– టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
పాలిటెక్నిక్‌ కళాశాలలను రక్షించాలి : దేవీప్రసాద్‌
హైదరాబాద్‌, జనవరి 10 (జనంసాక్షి) :కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసం చేయాలని ప్రయత్నిస్తే తెలంగాణ భగ్గుమంటుందని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌ పాలిటెక్నిక్‌లో నిర్వహించిన పాలిటెక్నిక్‌ జేఏసీ ఆవిర్భావసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం ఈనెల 28లోగా తేల్చాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ దాటవేసే ధోరణి ప్రదర్శిస్తే ప్రజలు ఊరుకోబోరన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటే తీవ్ర పరిణామాలుం టాయన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అధిష్టానంపై ఒత్తిడి పెంచి గడువులోగా ప్రత్యేక రాష్ట్రం ప్రకటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాజికి మార్పుకోసం జరిగిన అన్ని ఉద్యమాల్లో విద్యార్థుల పాత్ర కీలకమైనదని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నాటి నుంచి
నేటి వరకు ఉద్యోగులు, విద్యార్థులు పాత్ర కీలకమైనదన్నారు. తెలంగాణ ఉద్యమ బలోపేతానికి ఉద్యోగులు చేసిన పోరాటం వెలకట్టలేనిదన్నారు. సకల జనుల సమ్మెతో ఉద్యమం తారస్థాయికి చేరిన విషయం మరువరాదన్నారు. టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ మాట్లాడుతూ, పాలిటెక్నిక్‌ విద్యపై ప్రభుత్వం సరైనరీతిలో దృష్టి సారించడం లేదన్నారు. సర్కారు నిర్లక్ష్యంతో పాలిటెక్నిక్‌ విద్య కుంటుపడుతోందన్నారు. కళాశాలల రక్షణ కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాలని, ఈ పోరాటంలో అందరూ కలిసిరావాలన్నారు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.