మహబూబ్‌నగర్ వలసలు ఆగాలి
త్వరలో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
బస్తీలు బాగుపడాలి, జనం నడుం బిగించాలి
సీఎం కేసీఆర్
మహబూబ్‌నగర్, జనవరి 18(జనంసాక్షి): పాలమూరు ప్రజల సాగునీరు, తాగునీటి కష్టాల త్వరలోనే తొలగిపోతాయని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రాలు హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి త్వరలో శంకుస్థాపన చేస్తానని తెలిపారు. కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించామని వెల్లడించారు. భగీరథ ప్రయత్నం చేసైనా సరే జిల్లా ప్రజల నీటి కష్టాలను తీర్చుతానని తెలిపారు. మరో పది రోజుల్లో మళ్లీ పాలమూరుకు వస్తానని పేర్కొన్నారు. వెనుకబడిన మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని, త్వరలో వాటిని అమలు చేస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని విస్తరిస్తామని తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో పాలమూరు ఎంతో వెనుకబాటుకు గురైందని, ముఖ్యంగా మహబూబ్‌నగర్ పట్టణంలో పేద ప్రజలు డు దీనావస్థలో ఉన్నారని, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలో పాత పాలమూరులో మురికివాడల్ని సందర్శించారు. అక్కడి ప్రజల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పెంకుటిళ్లు, పూరిళ్లతో ఎలా కాపురాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి వారికి ఇళ్లు నిర్మించిస్తామని, ఇందుకుగాను మహిళా సంఘాలవారు ఐకమత్యంగా మాట్లాడుకుని అందమైన కాలనీల నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. ఇక్కడ అనేక కులాల మతాల వారున్నారని, దుర్భర పరిస్థితుల్లో ఉన్న వారికి ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా స్వయంఉపాధి కల్పించి ఆదుకుంఠామన్నారు. ప్రస్థుతం ఈశాఖ తనవద్దే ఉందని, ఎక్కువగా నిధులు కేటాయించి యువకులకు స్వయంఉపాథి కల్పించే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ముస్లిం మైనార్టీలకు 1030కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కాలనీలో కిరాయి ఇళ్లున్న వారికి వేరే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇప్పించి మంచి ఇళ్లు కట్టిస్తామన్నారు. బస్తీ బాగుపడాలంటే అందరూ ఐకమత్యంగా ఉండి అధికారులకు సహకరించాలని, వారం రోజుల్లోపు అధికారులకు కాలనీవాసులు సమ్మతి తెలిపితే అధికారులు ఇళ్ల నిర్మానానికి చర్యలు తీసుకుంటారని, ఆ తర్వాత తాను వచ్చి కాలనీకి శంకుస్థాపన చేస్తానన్నారు. ప్రతి నిరుపేదకు పకడ్బందీగా ఇళ్లు నిర్మించి, సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన ఖాళీ స్థలం, మిలాప్ హోటల్‌కు చెందిన యజమాని జుల్ఫికర్ ఆలీ తన 2030 గజాల స్థలాన్ని నిరుపేదల ఇళ్ల నిర్మానానికి ఉచితంగా అందిస్తానని ముఖ్యమంత్రికి చెప్పగా, ముఖ్యమంత్రి ఆలీని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, అర్హతగల ప్రతివారికి ఈ పథకాలు వర్తిస్తాయని, అర్హులు, దరఖాస్తులు చేసుకుని లబ్దిపొందాలని సూచించారు. భారీ పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, పార్లమెంట్ రెవెన్యూ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు జితెందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, దేవరకద్ర, అచ్చంపేట, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు, వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్థన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ శర్మన్, అదనపు జాయింట్ కలెక్టర్ రాజారాం, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ సునందరాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, అధికారులు పాల్గొన్నారు.