మహబూబ్ నగర్ లో కొనసాగుతున్న బంద్..
మహబూబ్ నగర్ : జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై అధికారపక్షం ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టారు. మంత్రుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. కరువు జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిలదీయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిండు సభలో దాడికి పాల్పడడంతో సమావేశం రణరంగమైంది. దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఈ రోజు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఉదయమే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బస్ డిపోల ఎదుట బైఠాయించారు. వనపర్తి, మహబూబ్ నగర్, షాద్ నగర్, గద్వాల డిపోల ఎదుట నేతలు ఆందోళన చేపట్టారు. దీనితో 9 డిపోల్లో దాదాపు 900 బస్సులు నిలిచిపోయాయి. వెంటనే బాలరాజు సభ్యత్వాన్ని రద్దు చేయాలని, అరెస్టు చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించనుంది. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వనున్నారు