మహమూద్‌ భయ్యా.. ఎమ్మెల్సీ బన్‌గయే

హైదరాబాద్‌, మార్చి 11 (జనంసాక్షి) :టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ మహమూద్‌ అలీ శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న పది ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పది స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఐదుగురు, టీడీపీ నుంచి ముగ్గురు, టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌ సీపీ నుంచి ఒక్కో అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేశారు. వారంతా ఏకగ్రీవంగా మండలిలో అడుగుపెట్టనున్నారు. ఆరోస్థానానికి అభ్యర్థిని పోటీలో నిలపాలని కాంగ్రెస్‌ పార్టీ చివరి నిమిషం వరకూ ప్రయత్నించింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతో ఉత్సాహంగా అభ్యర్థిని పోటీకి పెట్టాలంటూ అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ సూచనతో అధిష్టానం వెనక్కు తగ్గింది. ఆరో అభ్యర్థి గెలుపు మాట పక్కనబెడితే సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీ ఫిరాయిస్తే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని నివేదించడంతో అధిష్టానం సీఎం మాటను కాదంది. దీంతో మహమూద్‌ అలీ సునాయాసంగా మండలిలో అడుగుపెట్టనున్నారు. 2011లో నిర్వహించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంతపార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రకటించిన ఆరో అభ్యర్థి మోతె గంగారెడ్డి గెలిచి మండలికి వెళ్లారు. అధిష్టానం ఆశీస్సులతో కాంగ్రెస్‌ టికెట్‌ తెచ్చుకున్న మహ్మద్‌ జానీ అతికష్టంమీద గెలిచారు. అప్పుడు ఓటమి చవి చూసిన మహమూద్‌ అలీకి ఈసారి పార్టీ అండగా నిలబడుతుందా అనే అనుమానాలు తలెత్తాయి. సొంతపార్టీ ఎమ్మెల్యేలు అధినేత మాట మీరితే అలీకి విపత్కర పరిస్థితులు ఎదురయ్యేవి. కాంగ్రెస్‌ ఆరో అభ్యర్థిని బరిలో నిలపకపోవడంతో మొదట ఊపిరి పీల్చుకుంది టీఆర్‌ఎస్సే. మొత్తం మీద మహమూద్‌ ఏకగ్రీవ ఎన్నికతో టీఆర్‌ఎస్‌ పక్షాన ఓ మైనార్టీ నేత చట్టసభలో అడుగుపెట్టనున్నారు. ఆయన ఎన్నికపై పార్టీ నేతలకంటే ఎక్కువగా ఉత్సవాలు జరుపుకుంది మైనార్టీలే. తెలంగాణకే చెందిన ముగ్గురు మైనార్టీ నేతలు ఈ దఫా మండలికి ఎన్నికైనా మహమూద్‌ విజయాన్నే మైనార్టీలు తమ గెలుపుగా చెప్పుకున్నారు.