మహానాడులో తెలంగాణ కావాలని చెప్పిస్తరా?

టీడీపీ నేతలకు కడియం సవాల్‌
వరంగల్‌, మే 12 (జనంసాక్షి) :
తెలంగాణకు చెందిన టీడీపీ నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని మహానాడులో ఏకవాక్యం తీర్మానం చేయించాలని కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబుతో చెప్పించగలరా అని ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తనను అనేకరకాలుగా విమర్శిస్తున్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్యం చెడిపోయిందన్నారు. రాజకీయ వ్యభిచారినని పేర్కొనడం దౌర్భాగ్యం అన్నారు. టిడిపి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడు కూడా పార్టీ వెంటనే ఉన్నాన్నారు. దేవేందర్‌ గౌడ్‌, మోత్కుపల్లిలు ఎన్నిసార్లు పార్టీని మారారో టిడిపి నేతలకు తెలియదా అన్నారు. వ్యక్తిగత విమర్శల కు దిగుతూ దిగజారిపోతున్నారని ఆరోపించారు. వెంటే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలమేరకు ఉద్యమంలోకి వచ్చానని పేర్కొన్నారు. 9న్నర సంవత్సరాలు మంత్రిగా పని చేశానని, ఇంకా ఏపదవిపై వ్యామోహం లేదన్నారు. పదవులకోసం పార్టీలు మారిన వారు రాజకీయంగా ఎదుర్కొనలేకే విమర్శిస్తున్నారని ఆరోపించారు. బాబు కూడా తనకుటుంబానికి ఏదో వ్యక్తిగత సహకారాలు చేశానని చెప్పుకోవడం శోచనీయమన్నారు. తన కులం ఏమిటో తనకు తెలియదని ఆరోపణలు చేస్తున్న మోత్కుపల్లిలా దిగజారి మాట్లాడలేనన్నారు. పదవులకోసం పార్టీలు మారిన దేవేందర్‌గౌడ్‌, మోత్కుపల్లిలది రాజకీయ వ్యభిచారమా తనది వ్యభిచారమా ఆలోచించుకోవాలన్నారు. సంస్కారం మరిచిపోయి వ్యక్తిగత విమర్శలు చేయడం వారికే చెల్లుతుందన్నారు. పర్వతగిరి పుట్టానని, ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఇదే గ్రామంలో పుట్టాడని, తనకులం ఏమిటో మోత్కుపల్లికి సమాధానం చెప్పాలని ఎర్రబెల్లిని సూచించారు. కడియం శ్రీహరి పదవులు అనుభవించి వదిలి వెళ్లారని చెపితే సమాధానం చెప్తానన్నారు. మానవ సంబం దాలు మరిచిపోయి వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. కాకుల్లా అరుస్తున్నవారు, ముసా యిదా తీర్మాణంలో తెలంగాణా అంశమే లేనప్పుడు టిడిపిని ప్రజలు ఏమేరకు నమ్ముతారని ప్రశ్నించారు. సంస్కార హీనుడైన మోత్కుపల్లికి అంతకు రెట్టింపుగా సమాధానం చెప్పగలను కాని సంస్కారం అడ్డొస్తుం దన్నారు.  కులం, కుటుంబం అంటూ స్నేహానికి, రాజకీయానికి తేడా తెలియని నేతలు ఇష్టమొచ్చినట్లు విమర్శించడం సోచనీయమన్నారు. తనకు ఏవేవో అంటగడుతూ ఆరోపణలు చేస్తున్న వారు తనసూటి ప్రశ్నలకుఎందుకు సమాధానం చెప్పడంలేదని కడియంనిలదీశారు. టిటిడిపి ఫోరం అసలు ఉందా లేదా అని కన్వీనర్‌నే అడుగాలన్నారు. నాలుగు నెలలుగా సమావేశం పెట్టిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ సమాజం ఒక్కటిగా మారేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని కడియం పేర్కొన్నారు.