మహిళల చేతికి ‘భూమి’
శ్రీసత్యసాయి ఆసుపత్రికి విద్యుత్ రాయితీ కొనసాగిస్తాం
శ్రీ6వ విడత భూ పంపిణీలో సీఎం కిరణ్
అనంతపురం, నవంబర్ 3 (జనంసాక్షి):
ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్న నిరుపేదలకు త్వరలో పట్టాలిస్తామని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కోర్టు వివాదాలు లేని భూములను ఆయా జిల్లాలలో గుర్తించి మహిళల పేరు మీదే పట్టాలు ఇస్తామని ఆయన చెప్పారు. శనివారంనాడు పుట్టపర్తిలో ఆయన ఆరో విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ప్రస్తుతం 85వేల ఎకరాలను భూ పంపిణీ చేయనున్నామని చెప్పారు. 2004 తరువాత 6.80లక్షల ఎకరాలను పంపిణీ చేశామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది తమ కుటుంబాలను చక్కగా చూసుకు నేందుకు వీలుగా వడ్డీలేని రుణాలను అంది స్తున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘా ల ద్వారా అందించిన రుణాలకు దాదాపు రూ.15వందల కోట్లను మహిళల తరఫున ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తోందని చెప్పారు. దేశం మొత్తం మీద రూ. 25వేల కోట్ల రుణాలు ఇస్తే రాష్ట్రంలో రూ. 13వేల
కోట్లను స్వయం సహాయకసంఘాలకు అందించామని చెప్పారు. కోటి 45లక్షల మహిళా సంఘాలు ఉండడం చాలా గొప్ప విషయమని, మహిళా సాధికారితలో వచ్చిన విప్లవమని ఆయన చెప్పారు. దాదాపు 11మిలియన్ల కుటుంబాలు ఇందిరాక్రాంతి పథకంలో దారిద్య్రరేఖను దాటయని చెప్పారు. మహిళలు కుటుంబం పట్ల శ్రద్ధతో వ్యవహరిస్తున్నందునే వారికి మరిన్నీ విరివిగా రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. విద్య, కుటుంబ ఆరోగ్యం పట్ల మహిళలు శ్రద్ధ వహిస్తున్నామని ప్రశంసించారు. అంతేకాక పదిలక్షల ఎకరాలను ఎస్పీ, ఎస్టీలకు ఇందిర జలప్రభ ద్వారా సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ఈ వర్గాలకు భూములు ఇవ్వడమే గాక, భూ సార పరీక్షలను జరిపి వాటిని సాగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. హంద్రీనీవా పథకం ద్వారా రాయలసీమ జిల్లాలకు నీరందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ముందుగా అనంతపురం, కర్నూలు జిల్లాలకు నీరు అందిన తర్వాతే తన సోంత జిల్లా చిత్తూరుకు నీరు అందుతుందని అన్నారు. అనంతపురం జిల్లాలో 7329మంది లబ్దిదారులకు 14,306ఎకరాలను పంపిణీ చేశారు. స్వయం సహాయ సంఘాలకు 128కోట్లు, మెస్మా పథకంలో రూ. 110కోట్లు రుణాలను పంపిణీ చేశారు. మహిళా రైతులకు ముఖ్యమంత్రి పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సత్యసాయి సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యసాయి ఆసుపత్రికి విద్యుత్ రాయితీని కొనసాగిస్తామని చెప్పారు. రూ.80కోట్లతో చేపట్టే సాగునీటి పథకాలకు అనుమతులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యాశాఖమంత్రి ఎస్. శైలజా నాథ్‌తో పాటు పలుజిల్లాల కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పుట్టపర్తిలో కార్యక్రమాలను పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు