మహిళా ఉద్యమకారిణి వీణా మజుందార్‌ కన్నుమూత

న్యూఢిల్లీ, మే 30 (జనంసాక్షి) :
ప్రఖ్యాత మహిళా ఉద్యమకారిణి డాక్టర్‌ వీణా మజుందార్‌ కన్నుమూశారు. పార్లమెంట్‌ తదితర చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటూ చికరిదాకా పోరాడిన విద్యావేత్త  వీణా గురువారం మరణించారు. 86 ఏళ్ల వీణ ఊపిరితిత్తుల్లో కణతులతో బాధపడ్డారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ‘భారత్‌లో మహిళా స్థితిపై కమిటీ’కి వీణ కార్యదర్శిగా పనిచేశారు. ఈ కమిటీ 1974లో ‘సమానత దిశగా’ అనే పేరిట భారత్‌లో మహిళల స్థితిగతులపై తొలిసారిగా ఓ నివేదిను రూపొందించింది. భారత్‌లో మహిళల అధ్యయనం, స్థితిగతుల విషయంలోఈ నివేదిక ఓ మేలిమలుపుగా మారింది. భారత సామాజిక శాస్త్రాల పరిశోధక మండలి (ఐసీఎస్‌ఎస్‌ఆర్‌) లో ఆమె జాతీయ పరిశోధక ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఐసీఎస్‌ఎస్‌ఆర్‌  కింద స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసిన ‘మహిళల అభివృద్ది అధ్యయన కేంద్రానికి(సీడబ్ల్యూడీఎస్‌)’ వ్యవస్థాపక సంచాలకురాలిగా వ్యవహరించారు. వీణా మజుందార్‌ 1927లో కోల్‌కతా బెంగాలీ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. బనారన్‌ హిందూ యూనివర్సిటీలో చదువుకుని, 1947లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లి డిఫిల్‌ అనంతరం 1962లో దేశానికి తిరిగొచ్చారు. పాట్నా వర్సిటీ, బర్హంపూర్‌ వర్సిటీల్లో బోధించారు. యూజీసీ, ఐసీఎస్‌ఎస్‌ఆర్‌లలో వివిధ బాధ్యతలు చేపట్టారు. భాజపా నేత యశ్వంత్‌సిన్హా తదితరులు ఆమె శిష్యులు. సీపీఎం నేతలు ప్రకాశ్‌, బృందా కారత్‌, సీతారాం ఏచూరి వీణకు సన్నిహితులుగా పేరొందారు.