మాకు విప్‌ అందలేదు

వేణుగోపాలా చారి, హరీశ్వర్‌రెడ్డి
స్పీకర్‌ విచారణకు ధిక్కార ఎమ్మెల్యేలు డుమ్మా

హైదరాబాద్‌ :
మాకు విప్‌ అందలేదని, తాము గతంలోనే సమాధానం ఇచ్చామని, మళ్లీ విచారణ అవసరం లేదని ధిక్కార సభ్యులు ముథోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం విప్‌ ధిక్కరించిన టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ విచారణకు గైర్హాజరయ్యారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ ధిక్కరించిన తొమ్మిది ఎమ్మెల్యేలపై తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మంగళవారం విచారించారు. అయితే, ధిక్కార ఎమ్మెల్యేలు మాత్రం హాజరు కాలేదు. విప్‌ ధిక్కారణపై గతంలోనే తాము వివరణ ఇచ్చామని, మళ్లీ విచారణ అనవసరమని.. అసెంబ్లీ సాక్షిగా విప్‌ ధిక్కరించి ప్రభుత్వానికి ఓటు వేసిన తమపై వేటు వేయాలని ధిక్కార ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ రాశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సందర్భంగా తటస్థంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ విప్‌ జారీ చేసింది. అయితే, తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు విప్‌ ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఆయా పార్టీలు విప్‌ ధిక్కరించిన శాసనసభ్యులపై వేటు వేయాలని సభాపతికి ఫిర్యాదు చేశాయి. ఎమ్మెల్యేలు కొడాలి నాని (గుడివాడ), అమర్నాథ్‌రెడ్డి (పలమనేరు), ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (తంబళ్లపల్లి), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), సాయిరాజ్‌ (ఇచ్చాపురం), తానేటి వనిత (గోపాలపురం), హరీశ్వర్‌రెడ్డి (పరిగి), వేణుగోపాలాచారి (ముధోల్‌)లపై వేటు వేయాలని టీడీపీ కోరింది. దీనిపై స్పీకర్‌ సోమవారం విచారణ చేపట్టగా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఇది వరకే తాము వివరణ ఇచ్చినందను ఇక విచారణ అనవసరమని, తక్షణమే తమను అనర్హులుగా ప్రకటించాలని లేఖ రాశారు. మంగళవారం టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను స్పీకర్‌ విచారణ చేపట్టగా.. ఆ పార్టీకి చెందిన ధిక్కార ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరయ్యారు. టీడీపీ విప్‌ ధూలిపాళ్ల నరేంద్ర, పార్టీ తరఫున న్యాయవాదులు హాజరయ్యారు. విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ధూళిపాళ్ల సభాపతికి విజ్ఞప్తి చేశారు. అయితే, తాము గతంలోనే సమాధానం ఇచ్చామని, మళ్లీ విచారణ అవసరం లేదని ధిక్కార సభ్యులు స్పీకర్‌కు లేఖ రాశారు. నిండు అసెంబ్లీలో సభాపతి సాక్షిగా విప్‌ ధిక్కరించిన తమపై అనర్హత వేటు వేసి, తక్షణమే ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు.