మాజీ మంత్రి కోద్నాని, భజరంగిని

వెనకేసుకొచ్చిన మోడీ సర్కార్‌
96 మందిని బలిగొన్న కేసులో
మరణశిక్షపై మనసు మార్చుకున్న గుజరాత్‌

అహ్మదాబాద్‌, మే 14 (జనంసాక్షి) :
96 మందిని బలిగొన్న 2002 నాటి నరోడా పాటియా అల్లర్ల కేసులో మాజీ మంత్రి మాయా కొద్నాని, భజరంగ్‌దళ్‌ నాయకుడు బాబు భజరంగీలకు మరణ శిక్ష విధించాలని చేసిన సిఫార్సుపై మనసు మార్చుకోవాలని గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మితవాద శక్తుల తీవ్ర ఒత్తిడి నడుమ మోడీ సర్కార్‌ ఈ అంశంపై వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. కొద్నాని, బజరంగీలకు దిగువ కోర్టు జీవిత ఖైదు విధించగా, వీరికి మరణశిక్ష విధించాలని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) చేసిన సిఫారసుకు అనుగుణంగా వెళ్ళాలని తొలుత గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది. చివరికి మితవాద శక్తుల ప్రమేయంతో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని భావించినట్లు తెలిసింది. ఈ అంశం పై రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సి ఉన్నందున అప్పటి వరకు ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టామని గుజరాత్‌ ఆర్థికమంత్రి, అధికార ప్రతినిధి నితిష్‌ పటేల్‌ చెప్పారు. నరేంద్ర మోడి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కొద్నాని ఆగష్టు 2012లో ఒక ప్రత్యేక కోర్టు 28 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బాబూ బజరంగీకి జీవిత ఖైదు పడగా, మరో ఎనిమిది మందికి 31 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష పడింది.