‘మార్చ్ ‘ ఆగదు మాజీ పీసీసీ చీఫ్ కేకే
ఢిల్లీకి చేరిన టీ ఎంపీలు
30 లోపే నిర్ణయం కోసం ఒత్తిడి పెంచుతాం
కవాతుకు మద్దతు : టీ ఎంపీలు
హెదరాబాద్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి):
తెలంగాణ ప్రాంత ఎంపీలు మళ్లీ ఢిల్లీ బాట పట్టారు. సత్వరమే తెలంగాణపై నిర్ణయం వెలువరించాలని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు హస్తినకు బయల్దేరి వెళ్లారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా పెద్దలందరినీ కలిసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, అది కూడా తెలంగాణ మార్చ్ జరిగే సెప్టెంబర్ 30లోగా నిర్ణయం వెలువరించాలని ఒత్తిడి తీసుకురానున్నట్లు ఎంపీలు తెలిపారు. ఢిల్లీ వెళ్లే ముందు వారు కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు నివాసంలో భేటీ అయ్యారు. అధిష్టానంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి? తెలంగాణ మార్చ్‌ను ఏ విధంగా విజయవంతం చేయాలి? తెలంగాణవాదులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై ఈ సమావేవంలో చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం కేకేతో సహా టీ-ఎంపీలు విూడియాతో మాట్లాడారు. మార్చ్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. తెలంగాణ మార్చ్‌ను ఆపే ప్రసక్తే లేదని కే.కేశవరావు స్పష్టం చేశారు. తామంతా మార్చ్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడంచారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు లేఖలు రాసినంత మాత్రాన సరిపోదని, మంత్రులు కూడా ఉద్యమంలో ముందుండాలని కేకే సూచించారు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోయారని, అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురయ్యారని కేశవరావు అన్నారు. నీళ్లు, రోడ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు.. ఇలా ఏ అంశంలో చూసినా సీమాంధ్రుల పెత్తనమే కొనసాగుతోందని, ఇకనైనా తెలంగాణవారికి న్యాయం జరగాలంటే రాష్ట్ర విభజన జరగాల్సిందేనని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో సీమాంధ్ర ప్రాంత నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కేకే కోరారు. ఇక కలిసి ఉండలేమని, శాంతియుతంగా రాష్ట్ర విభజన జరిగేలా సహకరించాలని ఆయలన సీమాంధ్ర నేతలకు విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం స్పాన్సర్డ్ ఉద్యమమని తెలంగాణ ప్రాంత ఎంపీలు ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొందరు పెట్టుబడిదారులు పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర అనే వారికి తెలంగాణలో స్థానం లేదని వారు స్పష్టం చేశారు. ఈ నెల 30న తెలంగాణ పొలిటికల్ జేఏసీ తలపెట్టిన తెలంగాణ మార్చ్‌లో తాము పాల్గొంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణ మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. కవాతుకు టీఎంపీల మద్దతు తెలుపుతున్నట్టు వారు ప్రకటించారు. ఉద్యమాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రభుత్వం ఇలాంటి తప్పుడు పనులు చేస్తోందని విమర్శించారు.