మావోయిస్టుల అణచివేతకు సైన్యాన్ని వాడం : ఆంటోనీ

తంజావూర్‌, (జనంసాక్షి) :
మావోయిస్టుల అణచివేతకు సైన్యాన్ని ఉపయోగించబోమని భారత రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని స్పష్టం చేశారు. స్థానిక పారా మిలటరీ శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించి వారిని అణచివేయాలనే డిమాండ్‌పై ఆయన స్పందించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు విరుచుకుపడి సల్వజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నందకుమార్‌ సహా 20 మందిని హతమార్చిన నేపథ్యంలో దండకారణ్యంలో సైన్యాన్ని దించి మావోయిస్టులను ఏరివేయాలనే డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆంటోని ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మావోయిస్టులను అదుపులోకి తీసుకురావడం ఆయా రాష్ట్రాలే చూసుకుంటాయని సమాధానమిచ్చారు. స్థానిక పోలీసు, పారా మిలటరీ బలగాలను బలోపేతం చేసేందుకు తమ వంతు సహాకారం అందిస్తామని తెలిపారు. లడఖ్‌లో చైనా తాజా దుందుడుకు వ్యవహారాన్ని సైన్యం చూసుకుంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఐదు కిలోమీటర్ల వరకు రహదారి నిర్మించడమే కాకుండా భారత సైన్యం అక్కడ పహారా కాయకుండా చైనా బలగాలు నిరోధిస్తున్నాయి. దీనిపై సైన్యం నుంచి వివరాలు అందాయని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో భారత్‌ తన ప్రయోజనాలను రక్షించుకోలదని ధీమా వ్యక్తం చేశారు. భాతర్‌ ఇప్పుడు గత కాలం నాటిది కాదని చెప్పారు. చైనా తాజా చొరబాటును సిరిజావ్‌ అనే ప్రాంతంలో జరిగిందని, ఇది చైనా ప్రధాని లీకెకియాంగ్‌ భారత్‌ రాకమునుపే చోటుచేసుకుందని చెప్పారు.