మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం

శవాలను బంధువులకు చూపెట్టని పోలీసులు
కుటుంబీకుల ఆందోళన
ఖమ్మం, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) : ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో ఉన్న మృతదేహాలను బుధవారం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని కుంట ఆస్పత్రికి తరలించారు. అక్కడే పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశారు. తొలుత రాయ్‌పూర్‌లో పోస్టుమార్టం నిర్వహిస్తారని భావించారు. అయితే, పోలీసులు మాత్రం చివరకు కుంట ఆస్పత్రిలో శవపరీక్ష పూర్తి చేయించారు. మృతదేహాలను అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. అంతకు ముందు ఉదయం మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతదేహాలను చూపించడం లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మానవ హక్కుల సంఘం నేతలు కూడా దీనిపై మండిపడ్డారు. మృతదేహాలను చూపించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కాగా, మావోయిస్టుల మృతదేహాలను సందర్శించేందుకు టీడీపీ ఎమ్మెల్యే సీతక్కతో పాటు మానవ హక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం నేతలు, మావోయిస్టు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఖమ్మం ఆస్పత్రికి తరలివచ్చారు.

మృతదేహాలను భద్రపరచని పోలీసులు..

ఆంధ్రా-ఛత్తీసగఢ్‌ సరిహద్దులో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరచాలని, వారి కుటుంబసభ్యులకు చూపించాలని కోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను ధిక్కరించిన పోలీసులు మృతదేహాలను భద్రపరచలేదు. భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మావోయిస్టుల మృతదేహాలను కుప్పగా పడేశారు. దీంతో మృతదేహాల నుంచి దుర్వాసన వస్తోంది. మరోవైపు, మృతదేహాలను చూసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులను పోలీసులు అనుమతించ లేదు. తమ వారిని చూసుకొనేందుకు తెల్లవారుజామునే కుటుంబ సభ్యులు భద్రాచలం ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అయితే, పోలీసులు అనుమతిచంక పోవడంతో ఆందోళనకు దిగారు. మావోయిస్టుల మృతదేహాలను చూపించడం లేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను బంధువులకు చూపించాలన్న హైకోర్టు ఆదేశాలను కూడా పాటించక పోవడంపై మావన హక్కుల సంఘం సభ్యులు మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను కూడా పాటించరా? అని నిలదీశారు. కుటుంబ సభ్యులకు వెంటనే మృతదేహాలను చూపించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ఎస్పీతో వాగ్వాదానికి దిగారు. అయితే, పోలీసులు మాత్రం కుటుంబ సభ్యులను అనుమతించ లేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రాయ్‌పూర్‌ తరలించాల్సి ఉన్నందున మృతదేహాలను చూపించలేమని స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను భద్రపరచకుండా బయట కుప్పగా పడేయడంపై వారు మండిపడ్డారు.

మృతదేహాలను చూపించాలి : సీతక్క

మరోవైపు, మావోయిస్టుల మృతదేహాలను వెంటనే బంధువులకు చూపాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. మావోల మృతదేహాలను చూసేందుకు ఆమె భద్రాచలం ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చారు. అయితే, ఆమెతో పాటు మావోల కుటుంబ సభ్యులను పోలీసులు అనుమతించక పోవడంపై సీతక్క మండిపడ్డారు. మృతదేహాలను బంధువులకు చూపించాలన్న హైకోర్టు ఉత్తర్వులను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులు అందరూ బడుగు,బలహీనవర్గాలకు చెందిన వారేనని.. చనిపోయిన వారందరూ ప్రజా సమస్యలపై పోరాడిన వారేనన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కనీసం తమ వారి మృతదేహాలను చూసుకోవడానికి వచ్చిన బంధువులను అనుమతించక పోవడం సరికాదన్నారు. మృతి చెందిన మావోయిస్టుల్లో తన నియోజకవర్గానికి చెందిన వారు ఐదుగురు ఉన్నారని, అందులో ఒకరు తమ బంధువని.. అందుకే మృతదేహాలను చూసేందుకు వచ్చానని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులకు మృతదేహాలు చూపించాలని డిమాండ్‌ చేశారు.