మా ఉక్కు మాకేనని పది జిల్లాల్లో తెరాస పోరు

హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) :
మా ఉక్కు మాకే చెందాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పది జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. నగరంలోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్లలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆ పార్టీ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బయ్యారం లోనే స్టీల్‌ప్లాంటును ఏర్పాటు చేయాలన్నారు. బయ్యారం నుంచి విశాఖపట్నానికి తరలించేందుకు కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం నుంచి ఒక్క రవ్వ ఖనిజాన్ని కూడా తరలించనివ్వబోమని హెచ్చరించారు. బయ్యారం విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. బయ్యారం గనుల తరలింపుపై జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు. లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణలోనే స్టీల్‌ప్లాంటు ఏర్పాటు చేయాలని డిమాండు చేస్త్తూ.. శుక్రవారంనాడు తెలంగాణ జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెల 14న ఈ డిమాండులో భాగంగా మండల కేంద్రాల్లో ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో పార్టీ నేతలు పాదయాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ మూడు జిల్లాల ప్రజలను ఏకం చేసి తెలంగాణలోనే స్టీల్‌ ప్లాంట్‌ పెట్టేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ప్రభుత్వం మూర్ఖత్వానికి పోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బయ్యారంలోనే స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నాయిని హెచ్చరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అహంకారం నశించాలంటూ పార్టీ కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.