మా గనులు మాకేనని

సహజ వనరుల పరిరక్షణకు కదిలిన యాత్ర
ఇది రాజీలేని పోరాటం
సీఎం అహంకారంతో మాట్లాడుతుండు : కోదండరామ్‌
కరీంనగర్‌/భీమదేవరపల్లి, మే 27 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన గనులు సీమాంధ్ర ప్రాంతానికి తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని, మా గనులు మాకేనని చాటిచెప్తూ టీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ఇనుపరాతి గుట్టల నుంచి  టీ జేఏసీ ఆధ్వర్యంలో ఇనుప ఖనిజం పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. తెలంగాణపై రాజీపడే ప్రసక్తే లేదని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తేల్చి చెప్పారు. బయ్యారం ఉక్కు ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఖనిజం ఉన్న చోటనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు. బయ్యారం విషయంలో సీఎం కిరణ్‌ మొండి పట్టుదల విడనాడాలని హితవు పలికారు. సీఎం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోక పోతే ఉక్కును ఎలా తరలిస్తారో చూస్తామని హెచ్చరించారు. బయ్యారం వరకు నిర్వహించనున్న బయ్యారం సంరక్షణ యాత్రను సోమవారం తెలంగాణ జేఏసీ కార్యాలయం వద్ద కోదండరాం బీజేపీ నేత విద్యాసాగర్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ..  బయ్యారం ఉక్కును ఇక్కడి నుంచి విశాఖపట్నం తరలిస్తే స్థానికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారన్నారు. బయ్యారంలోనే స్టీల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం, బయ్యారం పరిరక్షణ కోసం త్వరలోనే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలిపారు. బీహెచ్‌ఈఎల్‌, మహీంద్రా కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పడితేనే మన వనరులను మనం కాపాడుకోవచ్చని తెలిపారు. లేకపోతే మన వనరులన్నింటినీ సీమాంద్ర గద్దలు తరలించుకు పోతాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉక్కు విషయంలో అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే బయ్యారం గనులపై ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బయ్యారం నుంచి ఒక్క ఇనుప ముక్కను కూడా విశాఖకు తరలించలేరన్నారు. ఆంధ్ర పాలకులు బలవంతులైతే కావొచ్చు కానీ.. తాము బలహీనులం మాత్రం కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయడం లేదని కోదండరాం విమర్వించారు. బయ్యారంపై ముఖ్యమంత్రి బహిరంగంగా సవాల్‌ విసురుతూ నాగరిక విలువలు, చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బయ్యారం ఉక్కును విశాఖ పరిశ్రమకు తరలిస్తే ఆంధ్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ, బయ్‌ఆయరంలోనే 10 లక్షల టన్నుల సామర్థ్యం గల ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే 10 వేల మంది ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపుడతాయని తెలిపారు. సీఎం తన వైఖరి మార్చుకోవాలని, బయ్యారం గనులను విశాఖ ఉక్కు పరిశ్రమకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షడు శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. సీఎం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోక పోతే ఉక్కును ఎలా తరలిస్తారో చూస్తామని హెచ్చరించారు. బయ్యారం విషయంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని బీజేపీ సీనియర్‌ విద్యాసాగర్‌రావు కోరారు. తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి బయ్యారం గనులను విశాఖ ఉక్కు పరిశ్రమకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలన్నారు.