మా ప్రమాణ స్వీకారానికి మన్మోహన్‌జీ.. పాకిస్తాన్‌ రండి

నవాజ్‌ సాదర ఆహ్వానం
భారత్‌తో సత్సబంధాలు
అమెరికాతో అవే సబంధాలు
చైనాతో మిత్రుత్వం
ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) :
‘మా ప్రమాణ స్వీకారానికి మన్మోహన్‌జీ.. పాకిస్తాన్‌ రండి’ అంటూ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) అధినేత నవాజ్‌ షరీఫ్‌ భారత ప్రధాన మంత్రి మన్మోహ్మన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. పాకిస్తాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పీఎంఎల్‌ (ఎన్‌) విజయం సాధించిన సందర్భంగా సోమవారం ఆయన అంతర్జాతీయ మీడియాతో మాట్లా డారు. పొరుగుదేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడం తో పాటు, శాంతిని స్థాపించడమే తనముందున్న తక్షణ కర్తవ్యమని పాక్‌ పగ్గాలు చేపట్టబోతున్న నవాజ్‌షరీఫ్‌ ప్రకటించారు. భారత దేశంతో పాటు అగ్రదేశం అమెరికాతో సత్సంబంధాలు ఏర్పర్చుకునేందుకు నవాజ్‌ షరీఫ్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూస్తానన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, ప్రజలకు మేలైన పాలన అందిస్తానన్నారు. ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. అమెరికా, భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌లతో సంబంధాలు మెరుగుపర్చుకుంటామన్నారు. మిలిటరీతో ఎలాంటి సమస్య లేదన్నారు. 1999లో కార్గిల్‌ దాడికి సంబంధించి మాట్లాడుతూ… ఇందులో మిలిటరీని తప్పు పట్టాల్సింది ఏమీ లేదని, అప్పుడు జరిగిందానికి ముషారఫ్‌ బాధ్యుడని చెప్పారు. ఈ విషయంలో మిలిటరీని నిందించాల్సిన అవసరం లేదన్నారు. కార్గిల్‌ తరహా ఘటనలు మరలా జరగకుండా చూసుకుంటామని, బాంబే పేలుళ్ల ఘటనలు కూడా రిపీట్‌ కానివ్వమని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌లో ప్రజామోద ప్రభుత్వం ఏర్పడబోతుందని సిపిఎం జాతీయప్రధాన కార్యదర్శి  ప్రకాశ్‌ కరత్‌ ఢిల్లీలో అన్నారు. పాక్‌ – భారత్‌ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆయన ఆకాంక్షించారు.