మా సుందర హైదరాబాద్‌ నగరాన్ని కాలుష్య కాసారంగా మార్చారు

మీరా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ?
హైదరాబాద్‌ను, తెలంగాణను విడదీసి చూడలేం
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, జనవరి 22 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ నిజాం కాలంలోనే అత్యంత సుందర నగరమని, అలాంట నగరాన్ని కాలుష్య కాసారంగా మార్చేసిన సీమాంధ్ర నేతలు తామే అభివృద్ధి చేశామనడం హాస్యాస్పదంగా ఉందని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగళవారం మంత్రి ముఖేశ్‌గౌడ్‌ నియోజకవర్గం గోషామహల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్రులకు తొత్తులుగా మారిన హైదరాబాద్‌ మంత్రులు వారి అవాకులు, చెవాకులకు వంత పాడటం మానుకోవాలని హెచ్చరించారు. యావత్‌ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర కావాలని కోరుకుంటుంటే హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా కోరుకోవడం పెట్టుబడిదారులకు తొత్తులుగా వ్యవహరిం చడమేనన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నడిచే ఏ నేతకైనా భవిష్యత్‌లో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. ఖైరతాబాద్‌, గోషామహల్‌ సీమాంధ్రుల రాకతో ఏర్పడినవి కావని అంతకుముందే యావత్‌ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసనవేనన్నారు. గుప్పెడు మంది పెట్టుబడిదారుల ఆస్తుల పరిరక్షణ కోసం కోట్లాది మంది ప్రజల హక్కులు ఫణంగా పెట్టడం అన్యాయమన్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వారు వలస వచ్చిన వారితో పాటు పూర్వకాలం నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న వారి ఆకాంక్షను గౌరవిం చాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్‌ ప్రజలకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని, దానిని దాచిపెట్టి హైదరాబాద్‌ను తాము అభివృద్ధి చేశామంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజల కోసం, వారి ఆకాంక్షలు, హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ప్రతి తెలంగాణ మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కృషి చేయాలని తెలిపారు. హైదరాబాద్‌పై ఇక్కడి మంత్రుల వైఖరి మార్చు కోకుంటే రాబోయే రోజుల్లో తగిన రీతి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రజల మనోభావాలను
గౌరవించని ఏ నేతకూ అధికారంలో కొనసాగే హక్కులేదని, తక్షణమే రాజీనామా చేసి తాను ఇప్పుడు పాడుతున్న పాటను ఎజెండాగా పెట్టుకొని ఎన్నికల్లో నిలవాలని సవాల్‌ విసిరారు. సమావేశంలో జేఏసీ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.