మిగిలిన ‘నలుగురూ..’ రాజీనామా చేయండి
సోమవారం సీబీఐ జగన్ అక్రమార్జన, అక్రమ భూ కేటాయింపుల కేసుల్లో 14 మందిని నిందితులుగా పేర్కొంటూ, 177 పేజీల చార్జిషీటును కోర్టు ముందు పెట్టింది. ఈ చార్జిషీటులో ఎ1 నిందితుడు జగన్ కాగా, ఎ5 నిందితుడిగా మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును చేర్చింది సీబీఐ. ఈ విషయం మీడియాలో ప్రసారం కాగానే, ఢిల్లీలో ఉన్న మంత్రి ధర్మాన మనసు చివుక్కుమంది. తన పేరును చార్జిషీటులో పేర్కొనడాన్ని ఆయన అక్కడి నుంచే ఖండించారు. అంతేగాక, ఆరోపణలు ఎదుర్కొంటూ పదవిలో కొనసాగడం ధర్మానకు ‘కరెక్ట్’ కాదనిపించిందట ! అదే విషయాన్ని తన సన్నిహితులతో పంచుకున్నారట ! ఎవరో ‘పెద్దలు’ చెయ్యమనే దాకా వేచిచూడకుండా మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట ! నిర్ణయం తీసుకున్నదే తడువుగా సీఎంకి ఫోన్ చేసి ఈ విషయాన్ని చేప్పేశారట ! ఈ రోజు అంటే మంగళవారం తన రాజీనామ లేఖను గవర్నర్‌తోపాటు సీఎంకు పంపుతారట ! ఈ విషయంపై ధర్మాన ఢిల్లీ నుంచి వచ్చాక మాట్లాడుదామని సీఎం ఓదార్చారట ! అయితే, ధర్మాన తన ఆత్మప్రబోధానుసారమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తనతో ఉన్న వారితో చెప్పుకున్నారట ! ఎంత ఆశ్చర్యం ! ధర్మానకు ఎంత కాలానికి ‘ఆత్మప్రబోధ’ జ్ఞానం కలిగింది. ఆయనపై ఆరోపణలు నేడే కొత్తగా వచ్చినట్లు, మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ఎంత ముద్దుగా చెప్తున్నారు ! ఈ రాజీనామ నిర్ణయం ఆనాడే జగన్ అరెస్టుకు ముందు, అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు అయ్యే సమయంలో చేస్తే ఎవరైనా నమ్మే వాళ్లమో ! ఇప్పుడెవరు నమ్ముతారు ఆ ‘ఆరుగురిని’ ? జగన్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రలు రాజీనామా చేయండని నాడు అంతా మొత్తుకున్నా, ఏ మాత్రం స్పందించక, పదవుల మీద వ్యామోహంతో ఆ ‘ఆరుగురు’ తమ కుర్చీలు పట్టుకుని వేలాడారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మోపిదేవిని అరెస్టు చేసే వరకు కూడా ఆయన పదవిని వీడలేదు. ఇన్నాళ్లకు ధర్మాన తన పేరు చార్జిషీటులో ఉందని ఆత్మప్రబోధానుసారం రాజీనామా చేస్తున్నారట ! మరి అప్పుడేమైంది ఈ ఆత్మప్రబోధ ? ఇప్పుడు తన వంతు వచ్చింది, తాను కూడా కోర్టు ఆదేశిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయం, ఎక్కడ పదవిలో ఉండి అక్రమాలకు పాల్పడ్డాడన్న అపవాదు మోయాల్సి వస్తుందోనన్న సంశయం కలుగగానే ధర్మానకు వెంటనే ‘ఆత్మప్రబోధ’ జరిగింది ! ఆరుగురిలో మోపిదేవి, ధర్మానలు పోతే ఇంకా మిగిలింది నలుగురు. ఆ నలుగురు ఇంకా పదవులు పట్టుకు వేలాడుతూనే ఉన్నారు. వాళ్ల వంతు వచ్చిందని నమ్మకం కుదిరాక, వాళ్లకు కూడా ‘ఆత్మప్రబోధ’ జరుగుతుందేమో ! ఇంకా ధర్మాన కూడా రాజీనామా చేయలేదు. ఈయన భవితవ్యం నేడు ఢిల్లీ నుంచి వచ్చాక ‘ఆత్మప్రబోధ’ జరిగిందో లేదో తెలుస్తుంది. ఆరోపణలు మంత్రులకు ఇప్పుడు ‘ఆత్మప్రబోధ’ జరుగుతున్నా జనానికి ఏనాడో జరిగింది. వాళ్లు కూడా తమ ఆత్మప్రబోధానుసారం నిర్ణయం తీసుకుందామని నిర్ణయించుకున్నారు. ‘ఎంత నీతిమంతులను’ అందలమెక్కించారో తెలుసుకున్నారు. ఇంకా ప్రజల దృష్టిలో దిగజారిపోక ముందే మిగిలిన ‘నలుగురు’ కూడా ధర్మాన బాటలో నడవడం మంచిది. ధర్మానలాగే ‘ఆత్మప్రబోధ’ లాంటి సాకులు చెప్పినా, ఇప్పటికి చల్తా ! లేకుంటే, కుర్చీ మీద వాళ్లకు మోజు చావ లేదని నిరూపించుకున్నట్లే ! అయినా, ఇప్పుడేం నిరూపించుకుంటారు ? ఏనాడో నిరూపించుకున్నారు కదా ! జగన్ కోసం వైఎస్సార్ కనుసన్నల్లో ఫైళ్లను కదిలించి !