మిర్చి మార్కెట్‌ తరలింపులో రాజకీయాలు: బిజెపి

ఖమ్మం,జూన్‌4(జ‌నం సాక్షి): ఖమ్మం మిర్చి మార్కెట్‌ను తరలించే విషయంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ ప్రతాప్‌ అన్నారు. మిర్చి రైతులను పట్టించుకోని నేతలు ఇప్పుడు తమ స్వలాభం కోసం మార్కెట్‌ను తరలించే ప్రయత్నాల్లో ఉన్నారని ఆయన మండిపడ్డారు. సౌకర్యాలు కల్పిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదని, అయితే స్వలాభంకోసం ప్రయత్నిస్తే ఊరుకోబోమని అన్నారు. ఖమ్మంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఖమ్మం రూరల్‌ మండలం గుర్రాలపాడుకు తరలించాలని డిమాండ్‌ చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఖమ్మం మిర్చి మార్కెట్‌ను ఓ ప్రజాప్రతినిధి తన స్వలాభం కోసం రఘునాథపాలెం వైపు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆయన నిర్ణయాన్ని ఖమ్మం మూడో పట్టణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేళ్ల కేసీఆర్‌ పాలనలో అన్నీ మాయ మాటలు.. మోసపూరిత ప్రకటనలు తప్ప చేసిందేవిూ లేదని అన్నారు. మిషన్‌ భగీరథ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, వేసవిలో పేద ప్రజల గొంతు తడపలేకపోయారని విమర్శించారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని హావిూలు గుప్పించిన కేసీఆర్‌ ఇంత వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఉద్యోగుల్లో విభజన తీసుకొచ్చి తన పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచి తనపార్టీలో చేర్చుకుని బలం పెంచుకోవటం మినహా కేసీఆర్‌ సాధించింది ఏవిూలేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హావిూలు ఇస్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎకరానికి రెండు పంటలకు రూ.8 వేలు చొప్పున రైతులకు ఇస్తున్నట్లు ప్రకటనలు చేయటం తప్ప ఇచ్చింది లేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు అమలుకు నోచుకోవటంలేదన్నారు.

——-