మీది ‘డేరానగర్’.. మాది ‘భాగ్య’ నగర్
రాజధాని గతి లేక హైదరాబాద్‌కు వచ్చిండ్రు.. తిరుగులేని సాక్ష్యాలు ఇవిగో
వాళ్లు బాగు చెయ్యలేదు.. తెలంగాణ వల్లే బాగు పడ్డారు
‘డేరానగర్’ కర్నూల్ నుంచి హైదరాబాద్‌లోకి అక్రమంగా చొరబడ్డారు
బీరాలు పలుకుడే గానీ.. చేసింది పెసరంతైనా లేదు..
1956కు ముందు హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం స్థితిగతులపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం
పాడుబడ్డ మీ మట్టి బ్యారేజీలు
మా పైసల్లో గట్టిగ మరమ్మతు చేసుకొని
మాకు బువ్వ బెట్టినట్లు బొంకుతుంటవు గదరో
ఓ సీమాంధ్ర వలసవాది..
చీమలు పెట్టిన పుట్టల లోపట
ఇస నాగుపామువోలె జొర్రి
ఎగిసెగిసి బుసలు కొడుతున్నరు గదరో
ఓ సీమాంధ్ర వలసవాది
మద్రాసు నుంచి తన్ని తగలేస్తే
బూరెల బుట్టల పడ్డట్లు హైద్రాబాద్‌లో పడ్తిరి
ఇప్పుడు హైద్రాబాద్‌కే ఎసరు పెడుతమంటరు గదరో
ఓ సీమాంధ్ర వలసవాది
అత్త సొమ్ము తినుకుంట అల్లుడు కులికినట్లు
మా రెవెన్యూతో మీ హైటెక్ ఎస్టేటులకు సోకులు జేస్కొని
మాకేదో పీకి పెట్టినట్లు ఫోజులిస్తుంటరు గదరో
ఓ సీమాంధ్ర వలసవాది
తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ఉధృతమైనా, వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణవాదులు ఎప్పుడు డిమాండ్ చేసినా, సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ఆర్థికంగా నష్టపోయిందని ఇక్కడి ఆర్థికవేత్తలు, తెలంగాణలో సాంస్కృతిక విధ్వంసం జరిగిందని ఇక్కడి కవులు, మేధావులు ఎప్పుడు విచారం వ్యక్తం చేసినా సీమాంధ్ర పాలకులు ఒంటి కాలి మీద నిలబడతారని తెలిసిందే. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి వారు చేసిన, చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు లెక్కే లేదని కూడా తెలంగాణలో చిన్న పోరోనికి కూడా తెలుసు. పైగా తెలంగాణ అభివృద్ధి తమ పాలనలోనే జరిగిందని, హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర స్టేట్‌లో కలిశాకే ఇక్కడి ప్రజలకు నాగరికత తెలిసివచ్చిందని సీమాంధ్రులు పచ్చి అబద్ధాలు చెబుతుంటారు. తాము వచ్చాకే ఇక్కడి ఆర్థిక వ్యవస్థ బలపడిందని, తామే తెలంగాణను ఉద్ధరించినట్లు మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. కానీ, ఇదంతా ముమ్మాటికీ నూటికి నూరు శాతం అవాస్తవం. ఆంధ్ర రాష్ట్రంలో కలిశాకే, ఆ విద్రోహం జరిగాకే తెలంగాణ చాలా వెనుకబడిందన్నది పచ్చి నిజం. కానీ, ఈ నిజాన్ని సీమాంధ్రులు ఒప్పుకోరు. అందుకే, తెలంగాణ ఆంధ్రలో కలవక ముందు నాటి హైదరాబాద్ రాష్ట్రం ఎలా ఉండాలో పాఠకులకు తెలిపేందుకు ‘జనంసాక్షి’ కొంత సమాచారాన్ని సేకరించింది. ఇంకా ఇంకా సేకరించేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం ‘జనంసాక్షి’ దగ్గర ఉన్న సమాచారంతో నాటి హైదరాబాద్ రాష్ట్ర విశేషాలు, సీమాంధ్రలు చెబుతున్న అబద్ధాలతో పోల్చుతూ ప్రచురిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
1956కు ముందు హైదరాబాద్ రాష్ట్ర ముచ్చట్లు..
– విద్రోహంతో మన బంగారు తెలంగాణ, జిత్తులమారి ఆంధ్ర రాష్ట్రంతో కలవక మునుపు దేశంలోనే అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉండేది. కానీ, ఇప్పుడు ఆ స్థానం ఒక అడుగు వెనక్కి వేసి 5వ స్థానంలో ఉంది. అంటే హైదరాబాద్ అభివృద్ధిలో దేశ వ్యాప్తంగా చూస్తే వెనకబడ్డట్లే కదా !
– నాడు దేశంలోనే పటిష్ట అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉన్న ఒకే ఒక్క మహానగరం మన హైదరాబాద్. నేడు అదే మన రాజధానిలో చిన్నపాటి వర్షం కురిసినా ఏర్పడుతున్న ట్రాఫిక్ ఇక్కట్లు, జరుగుతున్న మరణాల గురించి తెలియనది కాదు. మరి సీమాంధ్ర పాలకులు ఉన్న వ్యవస్థను భ్రష్ఠు పట్టించినట్లే కదా !
– 1956లో నిజాం భారత ప్రభుత్వానికి సరెండర్ అయినప్పుడు మన హైదరాబాద్ రాష్ట్ర ఖజానాలో రూ.65 కోట్లు ఉన్నాయి. ఆ కాలంలో అంత మొత్తం అంటే నేడు 65 వేల కోట్లతో సమానం. ఆంధ్రలో కలిశాక ఈ నిధులతోనే సీమాంధ్ర పాలకులు ప్రకాశం బ్యారేజ్‌కు మరమ్మతులు చేసుకున్నారు. ఎంత మోసం ?
– ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక పాలన వ్యవస్థలో మొదటి ప్రాధాన్యం హైదరాబాదీలకే అని చెప్పిన ఆంధ్రోళ్లు, నేడు దాన్ని ఎంతగా అమలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం.
– నాడు మనకు పాలన నడిపేందుకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ సొంత భవనాలే. అధికారు లందరికీ అధికారికి నివాసాలుండేవి.
– నేడు పాలన సాగుతున్న అసెంబ్లీ, రాజ్‌భవన్, సచివాలయం తదితర కార్యాల యాలన్నీ నిజాం హయాంలో కట్టినవే. మరిప్పుడు పాలన వ్యవహారాలన్నీ ఆ భవనాల నుంచే ‘చక్కబెడుతున్న’ సీమాంధ్ర పాలకులు వచ్చి, కట్టించి, పాలన సాగిస్తున్న ఒక్క కొత్త భవనాన్నైనా చూపమనండి. చూపరు. ఎందుకంటే, కట్టిందే లేదు కాబట్టి.
– సీమాంధ్రులు చెప్పినట్లు వాళ్లు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిందేమీ లేదు. నాడు నగరవాసులు షాపింగ్
చేయడానికి మోజం జాహీ మార్కెట్, ఆబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, చార్మినార్, చూడీ బజార్ లాంటి విశాల మార్కెట్లు ఉండేవి.
– మీకు తెలుసా ? నేడు షాపింగ్ కాంప్లెక్స్‌గా మారింది గానీ, నాడు చార్మినార్ వెళ్లే దారిలో ఉండే మదీనా హోటల్ ఓ త్రీ స్టార్ హోటల్.
– అప్పట్లో నగరవాసులకు తాగడానికి హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్, గండిపేట లాంటి నీటి వనరులుండేవి. వా నుంచి పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్ దగ్గర ఉన్న వాటర్ ఫిల్టరైజేషన్ చేసే మీర్ ఆలం ట్యాంక్ నాటి నుంచి ఉన్నది. నేటికీ పాతబస్తీ వాసులు ఇక్కడి నుంచి వచ్చే నీళ్లనే తాగుతున్నారు.
– నగరాన్ని రెండుగా విభజించే మూసీనదిపై నేటికీ ఉన్న వారధి పురానాపుల్ నిజాం హయాంలోనే కట్టారు. ఇప్పటికి కూడా ఆ వంతెన మీద ఒక్క చిన్న రాయి ముక్క కూడా పెగల్లేదు. ఈ ఇంజినీరింగ్ అబద్ధాల ఆంధ్రోళ్లు వచ్చేటప్పుడు పట్టుకొచ్చినారా ? ముమ్మాటికీ కాదని నినదిద్దాం. ఆ తర్వాత కట్టిన నయా పుల్ కూడా అప్పట్లో కట్టిందే.
– ఇక సాలార్జంగ్ మ్యూజియం గురించి ఎవరికీ చెప్పనక్కర్లేదు.
– ఆ కాలంలో ఆంధ్రోళ్లు నాటకాలంటూ తిరుగుతుంటే, మన హైదరాబాదీలు షమా థియేటర్‌లో సినిమాలు చూసే స్థితిలో ఉన్నారు. దర్జాగా బతకడం మనకు తెలిసినంత వాళ్లకేం తెలుసు !
– ఫలక్‌నుమా ప్యాలెస్, చాంద్రాయణ గుట్ట చౌరస్తా ఆనాటి పాలకుల ముందు చూపునకు తురుపు ముక్కలు మాత్రమే.
– ఆ కాలంలోనే కాటేదాన్ ఏరియాలో లెదర్, స్టీల్, సరియా ఫ్యాక్టరీలున్నాయి. అప్పట్లో ఆ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలన్నీ మన వాళ్లవే.
– ఆఖరికి చనిపోతే తగులబెట్టడానికి శ్మశాన వాటికలు కూడా పక్కాగా నాడే కట్టుకున్నారు. నేడు ఆసియాలోనే అతి పెద్ద బస్‌స్టేషన్‌గా పేరుగాంచిన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ఉన్నది ఆ శ్మశానం పక్కనే. ఇంకోటి పురానపుల్ దగ్గరుంది.
– ఇలా చెప్పుకుంటూ పోతే మన హైదరాబాద్ రాష్ట్రం ముచ్చట్లు చెప్పుకోవడానికి సమయం సరిపోనంత చరిత్రున్నది.
– మరోసారి మిగతా విషయాలను మీ ముందుంచేందుకు ‘జనంసాక్షి’ తప్పక కృషి చేస్తుంది. ఇంకా సమాచార సేకరణ కొనసాగుతున్నది.
కానీ, సీమాంధ్రులు మాత్రం తాము వచ్చి వెలగబెట్టాకే హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి చెందిందని చెబుతారు. మళ్లెవరైనా సీమాంధ్రులు మేము వచ్చాకే తెలంగాణ డెవెలప్ అయిందని అంటే, పైన మేము వివరించిన ముచ్చట్లను, సంధించిన ప్రశ్నలను వాళ్ల ముందు పెట్టండి. తెల్ల మొహం వెయ్యక మానరు.
అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి..
– మన హైదరాబాద్ రాష్ట్రం గొప్పతనం గురించే చెప్పుకోవడమే కాదు. అభివృద్ధి మేమే చేశామనే ఆంధ్రోళ్ల పరిస్థితి అప్పట్లో ఎలా ఉండేదో కూడా తెలుసుకుందాం.
– ముందుగా చెప్పుకోవాల్సింది ఆంధ్ర రాష్ట్ర అవరణ గురించి. ఆంధ్రులు కొట్లాడింది, పొట్టి శ్రీరాములు దీక్ష చేసింది, ప్రకాశం రొమ్ము విరిచింది ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ఏ మాత్రం కాదు. కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం మాత్రమే.
– మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రులు అక్రమంగా, హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి సిరిసంపదలు, హైదరాబాద్ రాష్ట్ర హంగులు చూసి నిశ్చేష్టులయ్యారు. దాంతో కన్నుకుట్టి ఇక్కడే మకాం వేయాలని కుతంత్రం పన్ని స్థిరపడ్డారు. ఒకే భాష పేరుతో తెలంగాణను ఆంధ్రలో విలీనమయ్యేలా అక్కడి రాజకీయ ‘శకుని’లు పావులు కదిపారు. కానీ, ఒకే భాష నినాదాన్ని పక్కనబెట్టి తెలంగాణ యాసను ఎంతగా అవమానించారో, అవమానిస్తున్నారో తెలిసిందే.
– అంతేగాకుండా, ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన నవంబర్ 1వ తారీఖును బలవంతంగా యావత్ రాష్ట్ర అవతరణ దినోత్సవమని బుకాయిస్తూ తెలంగాణలో జరుపుకునేలా చట్టాలు చేశారు. ఇది నేటికీ చాలా మందికి తెలియని నిప్పులాంటి నిజం.
– అయితే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక దానికి రాజధానిగా కర్నూలు జిల్లా కేంద్రాన్ని ఎంచుకున్నారు. కర్నూలు అప్పటికి ఒక చిన్న పట్టణం మాత్రమే. నాడు ఓ రాష్ట్ర పాలన సాగించడానికి ఏ మాత్రం అనువైంది కాదు. ఇప్పటికి కూడా కాదనుకోండి. దీని గురించి ముందు ముందు చర్చిద్దాం.
– ముందుగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయం గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం.
– తెలంగాణను వేరు చెయ్యమంటే హైదరాబద్ కోసం పట్టుబడుతున్న ఆంధ్రోళ్లు, నాడు కూడా ఇప్పటి సీమాంధ్ర నాయకుల పూర్వీకులైన అప్పటి ఆంధ్ర నాయకులు మద్రాసు రాష్ట్రం నుంచి వేరే పడే ముందు మద్రాసు నగరాన్ని ఇవ్వాలని నానా యాగీ చేశారు. కానీ, అసలే కాస్త ప్రాంతీయాభిమానం, భాషాభిమానం ఎక్కువగా ఉన్న తమిళుల ముందు ఆంధ్రోళ్ల ఎత్తుగడలు సాగలేదు. దీంతో అక్కడి నుంచి తంతే వచ్చి కర్నూలులో డేరాలు వేసుకున్నారు. ప్రకాశం పంతులు లాంటి ఆంధ్ర నాయకుల మూర్ఖపు పట్టుదల వల్ల ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవడమే గాక, పొట్టి శ్రీరాములు ప్రాణాలు పోయే దాకా వచ్చింది.
– అప్పట్లో తమిళులను ఈ ఆంధ్రోళ్లు ఎంతగా వేధించారంటే, అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక చేసిన వ్యాఖ్యలే తమిళుల వేదనకు అద్దం పడుతాయి. ఆయన ఏమన్నారంటే ‘ఆంధ్ర డాగ్స్ లీవ్ మద్రాస్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్’ అని. అంటే.. ఆంధ్ర కుక్కల్లారా ఇరవై నాలుగు గంటల్లో మద్రాసు వీడండి అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అదీ ఆంధ్రోళ్ల చరిత్ర. ఇలాంటి దిక్కుమాలిన తిట్లు పడాల్సిన అవసరం ఏనాడూ తెలంగాణకు రాలేదు. ఎందుకంటే, మనది వీర తెలంగాణ కదా ! ఇక్కడి ప్రజలకు పెట్టడమే గానీ, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం తెలియదు మరి !
– ఇటు ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం నడుస్తున్నా 1930 నుంచే రాయలసీమవాసులు ఆంధ్రోళ్లతో కలిసి ఉండమని నిరసనలు చేస్తూ వచ్చారు. ఎందుకు చెయ్యరు ? ఆంధ్రోళ్ల బుద్ధి సాటి సీమవాసికి తెలియకుండా ఉంటుందా ! ఆంధ్రతో కలిసి ఉండడం కంటే మద్రాసు రాష్ట్రంతోనే కలిసి ఉండాలని నాటి సీమ నాయకులు తలిచారు. కానీ, విఫలమయ్యారు. కాదు.. ఆంధ్రోళ్లు చేశారు !
– చివరికి ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
– అప్పటికి కర్నూల్ ముందుగా చెప్పుకున్నట్లు చిన్న పట్టణం మాత్రమే. దీంతో సీమాంధ్రోళ్లు పాలన సాగించడానికి ఆఫీసులు లేవు, ఆఫీసులు నిర్వహించడానికి భవనాలు లేవు, ఎలాంటి కనీస అవసరాలు లేవు. ఫలితంగా సీమాంధ్రుల పాలన గుడారాలకు షిఫ్ట్ అయింది. ఇది నిజంగా నిజం. ఒక రాష్ట్ర పాలన వ్యవస్థ గుడారాల్లో నుంచి నడవడం దేశ చరిత్రలో అదే ప్రథమం.
– ఆఫీసలు గుడారాల్లోనే, అధికారులుండేది గుడారాల్లోనే. బురదమయ రోడ్లు, పారిశుధ్య నిర్వహన లేక నానా తంటాలు పడ్డారు. అప్పటి సీమాంధ్రులు నడిపిన పత్రికలే నాటి రాజధాని కర్నూల్‌ను డేరానగర్ అని వ్యవహరించి, వార్తలు రాశాయి. దినపత్రికల్లో ఆ ‘డేరానగర్’ పరిస్థితులపై నవ్వు తెప్పించే కార్టూన్లు కూడా ప్రచురించే వారు.
– ఈ డేరాల్లో అప్పట్లో పాములు, తేళ్లు కూడా వచ్చేవట ! ఈ గుడారాలకు ‘ఎ’ ‘బి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.
– ఒక్క ‘ఎ’ శిబిరంలోని గుడారాలే మొత్తం 217 ఉండేవి. ఇక ‘బి’ సంగతి సరేసరి. ఇన్ని గుడారాలున్న ఓ రాష్ట్ర రాజధానిని ‘డేరానగర్’ అనడంలో అతిశయోక్తి లేదేమో కదా !
– ఇక కాలకృత్యాలు తీర్చుకోవడానికి.. అదేనండి పొద్దునే ‘ఒకటికి, రెండుకు’ వెళ్లాలంటే పౌరులతోపాటు అధికారులు, నాయకులు చెంబులు చేతబట్టుకుని పొలాల గట్ల వైపు నడిచేవారట !
– వర్షం పడితే గుడారాల సంగతి మరీ దారుణంగా తయారయయ్యేది. నీళ్లు ఎంతగా బయటికి పంపుతుంటే, అంతగా లోపలికి వచ్చేవట !
– పాలన వ్యవహారాలు చూడాలా.. లేక నీళ్లు తోలాలా అంటూ అధికారులు తలలు పట్టుకునే వారట !
– అధికారుల పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. కలరా, మలేరియాతో వాళ్ల కష్టాలు వాళ్లవి.
– కొంత కాలం గడిచాక అధికారుల కోసం ఇండ్లను చూశారు. వాళ్లను ‘డేరానగర్’లోని కార్యాలయాలకు తరలించేందుకు లారీలను వాడేవారు.
– అప్పటికే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూల్‌లో భవంతులు, వసతులు సమకూర్చునే స్థోమత ఆ రాష్ట్రానికి లేదు. దీంతో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి తెలంగాణను బలవంతంగా విలీనం చేసుకున్నారు.
– హైదరాబాద్‌లో ఉన్న అన్ని వసతులను వినియోగించుకునేందుకు వెంట వెంటనే రాజధానిని కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు మార్చేశారు.
– ఇదీ సంక్షిప్తంగా 1956 వరకు అభివృద్ధి మంత్రాన్ని పదేపదే జపించే సీమాంధ్రుల దుస్థితి. వీళ్లు తెలంగాణకు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేశారా ? అలా చేసేవారే అయితే, అంత శక్తే వాళ్లకుంటే కర్నూల్‌నే అభివృద్ధి చేసుకునేవారు కదా ! మన హైదరాబాద్‌లో ఎందుకు పాగా వేసేవాళ్లు ? జర అలోచించండి !
చదివారు కదా ! ఎవరు ఎవరిని అభివృద్ధి చేశారో ? సీమాంధ్రోళ్లు కాదు తెలంగాణను అభివృద్ధి చేసింది. తెలంగాణ వల్లే వాళ్లు, వాళ్ల ప్రాంతాలు అభివృద్థి చెందారు. అదీ మన బంగారు తెలంగాణను దోచుకుని. మళ్లెప్పుడైనా ఏ సీమాంధ్రుడైనా మా వల్లే తెలంగాణ అభివృద్ధి చెందాడని అన్నాడో.. అంతే.. పైన చెప్పిన ‘నిప్పులు’ నిజం కాదని నిరూపించమనండి. చెమటలు క్కుడు ఖాయం.