‘మీరుసైతం’ తెలంగాణ కోసం ఎప్పుడైనా..

1ఆకలి చావులప్పుడు స్పందించలేదు

భారీవర్షాలతో వరదలొస్తే ఆదుకోలేదు

తెలంగాణ విద్యార్థి అమరుల కుటుంబాల కన్నీళ్లు తుడవలేదు

రైతులు పిట్టల్లా రాలిపోతే కనికరించలేదు

ఒకేతల్లి బిడ్డలమంటూ తెలంగాణపై సవతి ప్రేమ

రీల్‌ హీరోలు.. తెలంగాణ రియల్‌ విలన్లు

‘మేముసైతం’పై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం

హైదరాబాద్‌, నవంబర్‌ 29 (జనంసాక్షి) : వారు నిత్యం రంగుల జిలుగు వెలుగుల మధ్య తెరమీద తళుక్కున మెరుస్తారు..! తమ నటనను పండిస్తారు. నవరసాలు పలికించి ప్రజలను మంత్రముగ్దులను చేస్తారు..!! లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా సృష్టించి జనాన్ని ఇట్టే ఆకర్షిస్తారు..! ఆ ఆకర్షణ ముసుగులోనే నిలువునా దోచేస్తారు..!! వారే ఆంధ్రా హీరోలు. తెలంగాణలో ఉంటూ..! తెలంగాణ వనరులను సర్వస్వం వాడుకుంటూ..!! ఒక్కమాటలో చెప్పాలంటే.. వారి ఆదాయ వనరే తెలంగాణ.. సకల సంపదలకు కారణం తెలంగాణ భూములు..! అలాంటి తెలంగాణకే మోసం చేస్తారు. తెలంగాణ బిడ్డలకు ఏదైనా ఆపదొస్తే అంటిముట్టకుండా ఆమడదూరం పాటిస్తారు. అదే ఆంధ్రాలో చీమచిటుక్కుమన్నా..! అక్కడి ప్రజలకు ఆపన్నహస్తం అందించేందుకు పరుగుతీస్తారు.!!. అందులో భాగమే.. ఇటీవల ఆంధ్రాను అతలాకుతలం చేసిన హుదూద్‌ తుఫాను బాధితులను ఆదుకునేందుకు సినీతారాలోకం ఒక్కటైంది..! చితికిన బతుకులను బాగుచేసేందుకు ‘మేముసైతం’ అంటూ ముందుకొచ్చింది..!! గతంలో ఇలాంటి విపత్తులు తెలంగాణలో అనేకం వచ్చాయి. అయినా.. ఈ సినీలోకం.. వారిపట్ల దయ, జాలి, రుణ చూపలేదు. అలాంటి సందర్భాల్లో ఈ సినీలోకం ఎక్కడుందని..? ఇలాంటి ‘మేముసైతం’ కార్యక్రమాలు అప్పుడేమయ్యాయని..? ఇకనుంచైనా ‘మీరుసైతం’ తెలంగాణ కోసం ఎప్పుడైనా…! అంటూ ‘జనంసాక్షి’ దినపత్రిక ఆంధ్రా హీరోలపై గళం ఎత్తుతోంది..!!

తెలంగాణలో కరువులొస్తే కనకరించలేదు…

అప్పటి సమైక్యపాలన కాలంలో.. అంటే.. 1985 నుంచి 1990 ప్రాంతంలో తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు పండక ప్రజలు ఆకలితో అలమటించారు. చిన్నపిల్లలు సైతం ఆకలిని తట్టుకోలేక మృత్యువాతపడ్డారు. పశువులకు మేతలేక కొన్ని మరణించాయి. తమ పశువులకు తిండిపెట్టలేని అన్నదాతలు విధిలేని పరిస్థితుల్లో వాటిని కబేళాలకు తరలించారు. మరీముఖ్యంగా తెలంగాణలో అత్యంత పెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో తీవ్రమైన కరువు ఏర్పడింది. చేయడానికి పనుల్లేక, తినడానికి తిండికిలేక ఈ రెండు జిల్లాల ప్రజలు అన్నమోరామచంద్ర అని మొత్తుకున్నా ఆంధ్రా పాలకులు ఆదుకోలేదు. కనీసం వారిని పరామర్శించనూ లేదు. ఇక హీరోలకైతే.. వారి ఆకలిచావుల గోస చెవికెక్కలేదు.

తెలంగాణలోనూ భారీ వదరలొచ్చాయి…

తెలంగాణలో కూడా 2009లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఊళ్లకు ఊళ్లే నీటమునిగాయి. అక్కడి ప్రజలు వరదనీటిలో సర్వస్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూశారు. ఇళ్లన్నీ నీటిలో మునిగి ఊరంతా చెరువును తలపించాయి. లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. వేలాది మంది రైతులు పంటలు కోల్పోయి.. అప్పుల్లో తేలారు. కొందరు ఆ నష్టాన్ని భరించలేక ప్రాణాలు కూడా విడిచారు. అలాగే 2000 సంవత్సరంలో హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదనీటి ఉధృతికి నాలాలన్నీ ఉప్పొంగాయి. నాలాల పరీవాహక ప్రాంతాల్లో నివాసముండే చిన్నజీవులు ఈ వరదల్లో అన్నీ కోల్పోయారు. అయినా.. సమైక్య పాలకులుగానీ, ఇప్పటి ‘మేముసైతం’ సినీలోకం గానీ పైసా సాయం చేయలేదు. వరదబాధితులకు పునరావాసం కల్పించలేదు. అప్పట్లో వీరి జాడ మచ్చుకైనా కనిపించలేదు. ఏమైనా ఇళ్లు.. షూటింగ్‌లే తప్ప తెలంగాణ ప్రజల కష్టసుఖాలను పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆంధ్రాలోని హుదూద్‌ తుఫాను బాధితుల పట్ల ఉన్న దయ, జాలి, కరుణ అప్పుడేమైందని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

విరాళాలన్నీ ఆంధ్రాకే…

సీమాంధ్ర పాలకులుగానీ, సీమాంధ్ర మీడియా యాజమాన్యాలుగానీ, సినిమాహీరోగానీ.. సర్వం తెలంగాణ వనరులు అనుభవిస్తూ.. ఆంధ్రామీద ప్రేమలు కురిపిస్తున్నారు. అసలు సీమాంధ్రులకు వస్తున్న ఆదాయమంతా తెలంగాణ నుంచే వస్తోంది. తెలంగాణలోని వేల ఎకరాల భూములను తమ గుప్పిటపట్టి తెలంగాణ ప్రజలకు పైసా విరాళం ఇవ్వరు. తెలంగాణలో ఎన్ని విపత్తులు వచ్చినా.. ఇక్కడి ప్రజలు ఎన్ని బాధల్లో ఉన్నా వారు స్పందించరు. ఆర్థికంగా చేయూతనివ్వరు. అదే సీమాంధ్ర ప్రాంతానికి ఏ చిన్న ఆపదొచ్చినా అన్ని సందర్భాల్లోనూ ఆదుకుంటారు. సమైక్యపాలనలో సీమాంధ్ర మీడియా తెలంగాణ ప్రజల కష్టాలను ఎప్పుడూ పూర్తిస్థాయిలో చూపలేదు. తెలంగాణ బిడ్డల సమస్యలపై ఎప్పుడూ సరైన సమయంలో స్పందించలేదు. ఇక్కడి ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు సీమాంధ్ర హీరోలుగానీ, మీడియా సంస్థలుగానీ తెలంగాణ ప్రజలకు అండగా నిలిచిన పరిస్థితులు లేవు.

తెలంగాణ విద్యార్థి అమరులను పరామర్శించలేదు…

ఆంధ్రాపాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు సాగిన పోరాటంలో ఎందరో తెలంగాణ విద్యార్థులు అమరులయ్యారు. తమ ప్రాణాలను తెలంగాణ కోసం తృణప్రాయంగా త్యజించారు. చేతికొచ్చిన బిడ్డలు ఉద్యమంలో అమరులైతే.. ఆ తల్లిదండ్రుల కడుపుకోత, వారిశోకం అంతా ఇంతాకాదు. వందలాది మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటే.. వారి కుటుంబాలను ఒక్కరంటే ఒక్క సినీ హీరో పరామర్శించిన పాపాన పోలేదు. అమరుల కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చిన దాఖలాలు లేవు. అమరుల కుటుంబాలకు ఒక్కరంటే ఒక్కరు ఆర్థిక సాయం అందించిన పరిస్థితి లేదు. తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో వారు అడుగడుగునా పక్షపాత ధోరణి ప్రదర్శించారు. పైకి మాత్రం తామంతా అన్నదమ్ములమని, ఒకేతల్లి బిడ్డలమని, తెలుగువారందరం కలిసుంటామని చెబుతారు. ఇలాంటి మాయమాటలతో తెలంగాణపై సవతితల్లి ప్రేమను ఒలకబోస్తారు.

తెలంగాణ రైతుల ఆత్మహత్యలపై స్పందించలేదు…

సమైక్యపాలన సాగినన్ని రోజులూ తెలంగాణలో అన్నదాతల కష్టాలు రోజురోజుకూ పెరిగిపోయి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణలోని ఎన్నో రైతు కుటుంబాల్లో చీకట్లు నిండాయి. వ్యవసాయం అచ్చిరాక రైతులు అప్పుల్లోతేలి ప్రాణాలు తీసుకుంటే.. వారి కుటుంబాలు కుటుంబ పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడ్డాయి. కొందరు రైతుల పిల్లలు అనాథలయ్యారు. చదువులకు దూరమయ్యారు. ఇలాంటి విషాధ సమయాల్లో కూడా ఒక్క హీరో అయినా.. ఒక్క సీమాంధ్ర మీడియా సంస్థ అయినా వారికి ఆర్థికంగా అండగా నిలబడిన వార్తలు ఎక్కడా వినిపించలేదు.. కనిపించలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కూడా అనేక మైంది రైతులు కరెంటు కష్టాల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటే.. ఆయా రైతు కుటుంబాలను ఒక్కరంటే ఒక్కరు హీరోలుగానీ, సీమాంధ్ర మీడియాగానీ పరామర్శించిన పాపాన పోలేదు. ఇలా రీల్‌ హీరోలు అప్పట్నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు రియల్‌ విలన్లుగానే ప్రదర్శిస్తున్నారు తప్ప తెలంగాణ రైతాంగానికి ఆపన్నహస్తం అందిస్తామని ముందుకొచ్చిన సందర్భాలు మచ్చుకైనా కానరావు.

‘మీరుసైతం’ తెలంగాణ కోసం ఎప్పుడైనా…

ఇప్పటికైనా.. మీరు ఏర్పాటు చేసిన ‘మేముసైతం’ కార్యక్రమాన్ని తెలంగాణ కోసం ఎప్పుడైనా నిర్వహించాలని యావత్‌ తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో జీవిస్తున్నందుకైనా.. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకైనా ప్రయత్నం చేయాలని, తెలంగాణపై సవతితల్లి ప్రేమను విడనాడాలని, ఆంధ్రాప్రజలతోపాటే తెలంగాణ ప్రజలు ఆపదల్లో ఉంటే మనస్ఫూర్తిగా స్పందించాలని ‘జనంసాక్షి’ కోరుతోంది.