మీ వెయ్యి నాకెందుకు?

చిల్లర లేకపోతే పేపర్‌ ఫ్రీగా చదువుకోండి
రాహుల్‌కు షాకిచ్చిన పేపర్‌బాయ్‌
చిన్నారిని దత్తత తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ
భోపాల్‌, మే 12 (జనంసాక్షి) :
‘మీ వెయ్యి నాకెందుకు? చిల్లర లేకపోతే పేపర్‌ ఫ్రీగా చదువుకోండి’ అంటూ ఓ పేపర్‌బాయ్‌ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి షాకిచ్చాడు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నగరంలో చోటుచేసుకుంది. ఏప్రిల్‌ 25న రాహుల్‌గాంధీ భోపాల్‌లో విమానాశ్రయానికి కారులో వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఒక చోట కారు ఆగినప్పుడు న్యూస్‌ పేపర్‌లు అమ్ముకునే కౌశల్‌ (10) అనే కుర్రాడు ఆయన దగ్గరకు వెళ్లి పేపర్‌ అమ్మజూపాడు. రాహుల్‌ పేపర్‌ తీసుకుని రూ. 1,000 నోటు కుర్రాడికి ఇచ్చాడు. అయితే తనవద్ద చిల్లరలేదంటూ తిరిగి ఇచ్చేశాడు.  మీరు పేపర్‌ చదువుకోండి అంటూ ఇచ్చేశాడు. అతడి తీరుతో ముచ్చట పడిన రాహుల్‌ ఆ కుర్రాడితో కొద్ది సేపు ముచ్చటించి వివరాలు కనుక్కొన్నాడు. తాను ఐదో తరగతి చదువుకుంటూ న్యూస్‌ పేపర్‌లు అమ్ముకుంటున్నట్లు చెప్పగా విని అబ్బురపడ్డాడు. తాను డాక్టర్‌ కావాలనుకుంటున్నట్లు కౌశల్‌ రాహుల్‌కు చెప్పాడు. అతనిని ఆదుకోవాల్సిందిగా పార్టీ మధ్య ప్రదేశ్‌ శాఖకు నాయకులను సూచించాడు. మధ్య ప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కాంతిలాల్‌ భూరియా శనివారం భోపాల్‌లో కౌశల్‌ను పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. అతని పెద్దమనసుకుగానూ తగురీతిలో సత్కరించి, తమ పార్టీ అతడిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ కుర్రాడికి నెలనెలా రూ. 1,000అందిస్తామని చెప్పారు. మరో సీనియర్‌ నాయకుడు కౌశల్‌ తండ్రికి తమకు గల విద్యాసంస్థలలో ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు.