ముందస్తుతో ఎవరికి లాభం
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలి: కాల్వ
అమరావతి,జూలై13(జనం సాక్షి): దేశవ్యాప్తంగా తన గ్రాఫ్ క్షీణిస్తోందని, దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకం కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన ప్రధాని మోదీ మదిలో మెదిలిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు ఉంటాయని బీజేపీలోని ముఖ్య నాయకులకు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు రహస్యంగా సమాచారం అందజేశారని అన్నారు. అయితే ఈ విషయం వైసీపీఅధ్యక్షుడు జగన్‌కు తెలియడంలో కూడా ఆశ్చర్యం లేదన్నారు. ఎందుకంటే బీజేపీకి ఆయన రహస్య నాయకుడని దీంతోనే తేలిపోయిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు.ఈ రెండు పార్టీల జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటేనని చెప్పారు. వైసీపీ అండ చూసుకుని రాష్ట్రంలో అధిక ఎంపీ స్థానాలున్న టీడీపీని వదులుకోవడానికి బీజేపీ సిద్ధపడిందన్నారు. వైఎస్ రాజశేఖరెడ్డి అనుంగు శిష్యుడుగా, అవినీతిలోనూ భాగస్వామిగా ఎదిగిన కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం కూడా వారి మధ్య ఉన్న లోపాయకారీ వ్యవహారాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. అందుకే కన్నా కూడా ఇప్పుడు టిడిపిపై లేనిపోని విమర్శలతో ప్రచారం పెంచుకోవాలని చూస్తున్నారని అన్నారు.ఐదేళ్లు పాలించాలని ప్రజలు తమకు తీర్పు ఇచ్చారని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి తేల్చిచెప్పారు. త్వరలోనే నిరుద్యోగ భృతిపై తుది రూపం తీసుకొస్తామన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ప్రకటిస్తామని తెలిపారు. కడప ఉక్కు విషయంలో టీడీపీది నిస్వార్థ పోరాటమన్నారు. కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులకు రాష్ట్రప్రభుత్వం రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అయినా కడప ఉక్కు కోసం అన్నిరకాల రాయితీలు, సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఐదారువేల కోట్ల మేర రాయితీలను రాష్ట్రమే భరిస్తోందని, ఇక కేంద్రం ఏవిూ చేయకుంటే ఎందుకని నిలదీశారు.