ముగిసిన బ్రిక్స్‌ సదస్సు చైనా అధ్యక్షుడితో మన్మోహన్‌ భేటీ

బ్రహ్మపుత్ర అంశాన్ని లేవనెత్తిన భారత్‌
డర్బన్‌, మార్చి 28 : భారత్‌తో ద్వైపాక్షిక, వాణిజ్య, రాజకీయ సంబంధాలు సుధృడంగా ఉండాలని చైనా నూతన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆకాంక్షించారు. ఇక్కడ జరుగుతున్న బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బుధవారంరాత్రి పొద్దుపోయిన తరువాత ఆయన, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కొంత తడవు చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించ తలపెట్టిన డ్యాంల అంశం ప్రస్థావించారు. చైనాలో కొత్త నాయకత్వం ఏర్పడిన తరువాత భారత ప్రధానితో జరిగిన తొలి ముఖాముఖి సమావేశం ఇదే. ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయిలో జరిగిన సమావేశంలో ఉభయదేశాల నాయకుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. వీరు ఇరువురి మధ్య దాదాపు 25నిముషాలపాటు సమావేశం జరిగింది. బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రతిపాదిత ప్రాజెక్టుల వల్ల భారత్‌కు వచ్చే నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని ప్రధాని చైనా అధ్యక్షుడి దృష్టి తెచ్చారు. అయితే అలాంటి ముప్పెమీ ఉండదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేర్కొన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. వీరి మధ్య జరిగిన ఈ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని, పలు అంశాలు చర్చకు వచ్చాయని తెలిపాయి. వీరు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారని ఆ వర్గాల చెప్పాయి. దక్షిణ చైనా అంశం తప్ప మిగిలిన అంశాలన్నీ చర్చకు వచ్చాయని చెప్పారు. సరిహద్దులు, వాణిజ్య అంశాలు చర్చించారా అన్న ప్రశ్నకు అన్నీ అంశాలు చర్చించారని తెలిపారు. ఈ సంబంధాలను మరింత ముందుకు కొనసాగించాలని ఉభయ దేశాల నాయకులు నిర్ణయించుకున్నారని అన్నారు. తమ ముందు పనిచేసిన నాయకులు జింటావో, వెన్‌జియాబవో మాదిరిగానే తాను కూడా భారత్‌తో సత్సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నట్టు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తెలిపారు.