మున్సిపల్‌ ఎన్నికలకు సైతం సన్నద్దం

ఓటర్ల గణన చేస్తున్న అధికార గణం
నల్లగొండ,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతుండగా మున్సిపల్‌ ఎన్నికలు సైతం మార్చిలో జరిగే అవకాశం ఉంది. ఇందుకు గాను రాష్ట్ర మున్సిపల్‌ యంత్రాంగం ఆదేశానుసారం జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఓటర్ల గణన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారం రోజుల పాటు ఈ గణన చేపట్టి రాష్ట్ర యంత్రాంగానికి తుది నివేదిక ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలోని పాత మున్సిపాలిటీలైన నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీలతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన హాలియా, నందికొండ, చిట్యాల, చండూరు మున్సిపాలిటీల్లోని ఆయా ప్రాంతాల్లో ఓటరు గణన చేపట్టేందుకు మున్సిపాలిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 29 వరకు  ఓటరు గణన చేయనున్నారు. ప్రధానంగా ఎస్సీ ఓటర్లతో పాటు ఎస్టీ, మహిళా ఓటర్లను గణించి పై అధికారులకు నివేదించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు గాను అధికారులు ఇప్పటికే వార్డుల వారిగా ప్రత్యేక బాధ్యతలు ఇస్తూ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అన్ని పురపాలికల్లోని వార్డుల్లో ఈ వారం రోజుల్లో గణన పూర్తి చేసి ఉన్నతాధికారులకు తుది నివేదిక సమర్పించనున్నారు. ఓటరు గణన అనంతరం ఈ నెల 30న పట్టణ వ్యాప్తంగా వార్డుల వారీగా పలు ప్రాంతాల్లో నోటిఫికేషన్‌ సంబంధించిన ఉత్తర్వులు అందజేసి జనవరి 2 నుంచి 4 వరకు ఓటర్లపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 5, 6 తేదీల్లో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యంతరాలపై విచారణ చేపట్టి 7, 8 తేదీల్లో తుది జాబితా తయారు చేస్తారు.
ఓటర్లలో ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లు ఏ మేరకు ఉన్నారనే కోణంలో ఈ గణన చేపడుతోంది. నూతన ఓటర్ల నమోదు లేకపోయినప్పటికీ ఇప్పటికే ఉన్నటువంటి ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఈ గణన చేయనున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రిజర్వేషన్‌ రాష్ట్రస్థాయిలో వర్గాల వారీగా దృష్టిలో పెట్టుకుని కేటాయించనుండగా స్థానికంగా ఆయా వర్గాల ఓటర్లను దృష్టిలో పెట్టుకుని వార్డుల వారీగా రిజర్వేషన్లను కేటాయించనున్నారు.