ముమ్మరంగా చెరువుల పునరుద్దరణ

భద్రాద్రికొత్తగూడెం,మే29(జ‌నం సాక్షి): చెరువుల పునరుద్దరణ విజయవంతంగా సాగుతోంది.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిషన్‌కాకతీయతో పల్లెను సస్యశ్యామలంగా ఉంచేందుకు చెరువులను సంసిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్‌ తరుముకొస్తున్న తరుణంలో రైతు సాగుచేసేందుకు ఇరిగేషన్‌ అధికారులు పూడికతీత, అలుగుల నిర్మాణం, కట్ట బలోపేతం వంటి పనులు మరింత వేగం చేస్తున్నారు. ఆయా మండలాల్లో చెరువుల పునరుద్ధరణ పనులు త్వరగతిన పూర్తిచేసేందుకు క్షేత్రస్థాయిలో ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు పడితే చెరువు, కుంటలు నిండి పుష్కలంగా నీరందుతుందని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాలుగో  విడతలో ఎంపిక చేసిన చెరువుల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  మిషన్‌ కాకతీయ మూడు విడుతల్లో జరిగిన పనులతో చెరువులకు జలకళ రావటమే కాకుండా సమృద్ధిగా పంటలు పండాయి. ఇప్పుడు మిగిలిన చెరువులకు మూడవ విడుతలో పనులు చేస్తున్నారు. ఇప్పటికే పినపాక నియోజకవర్గంలో మొదటివిడత మిషన్‌కాకతీయ పనులు విజయవంతంగా పూర్తి కాగా మిగతావి పునరుద్దరణలో ఉన్నాయి.  ఈ నెలాఖరి కల్లా పూర్తి కానున్నాయి. ఈ భూమిపూజ నిర్వహించిన చెరువుల్లో పూడికతీత, తూటికాడ తొలగింపు, అలుగు, తూముల నిర్మాణ పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది తమ పంట పొలాలకు మహర్దశ పట్టనుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగానే వర్షాలు ఈ ఏడాది వచ్చే అవకాశం ఉండటంతో ఈ చెరువు పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యత 
పాటించాలని అధికారులను ఆయకట్టు రైతులు కోరుతున్నారు.