మురికి దుర్గంధం నుంచి బయట పడుతున్న హుస్సేన్‌సాగర్
నీటిలో క్రమంగా పెరుగుతున్న ఆక్సిజన్ శాతం
తెలంగాణ సర్కారు చర్యలు సత్ఫలితం
మంచినీటి సరస్సుగా మార్చే ప్రక్రియలో ముందడుగు
‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం
అందమైన సరస్సుగా కనువిందు చేయడమే కాక వేలాది మంది ప్రజలకు దాహం తీర్చే హుసేన్‌సాగర్ 1970 వరకు బాగా ఉండేది. రానురాను పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా మురికి కూపంగా మారింది. సాగర్ పుట్టుక చరిత్ర పరిశీలిస్తే 1562లో ఇబ్రహిం కులీ కుతుబ్‌షా ఈ సాగర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. సూఫీ మతగురువు హుసేన్ షావలి, కులీ కుతుబ్‌షా మేనల్లుడు ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. చాలా లోతుగా, చాలా విశాలంగా కొన్నాళ్ల వరకు ఖాళీగా ఉండే సాగర్‌కు మూసీ నది నుంచి నాలాల ద్వారా మంచినీటిని రప్పించి సరస్సుగా రూపొందించారు. హుస్సేన్‌సాగర్ ని సందర్శించి ఆనాడు 1839లో ఫిలిప్ మేడోస్ టైలర్ అనే ఆంగ్ల రచయితన తన గ్రంధంలో హుస్సేన్ సాగర్ అందచందాలను వర్ణించాడు. అటువంటి హుస్సేన్‌సాగర్ రానురాను కుదించుకుపోయింది. ఆక్రమణల పాలైంది. వాస్తవానికి 24 చదరపు కిమీ వైశాల్యంలో ఉండే సాగర్ విస్తీర్ణం ఇప్పుడు 13 చదరపు కిమీ వరకు కుదించుకుపోయింది. దీన్నిబట్టి గత ప్రభుత్వాలు ఎంత చిన్నచూపు చూశాయో తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గత వైభవం తీసుకురాడానికి దీక్ష వహిస్తోంది.
హైదరాబాద్, జనవరి11(జనంసాక్షి) : హుస్సేన్‌సాగర్ మురికి శాపం నుంచి మెల్లమెల్లగా విముక్తి పొందుతోంది. అనుకున్న ప్రమాణాల మేరకు నీటి నాణ్యత పరీక్షలు చేయగా గతంలో కన్నా సత్ఫలితాలు బాగా కనిపిస్తున్నాయి. వివిధ నాలాల ద్వారా సాగర్ లోకి నీరు వచ్చి చేరుతుంది. ఒక్క కూకట్‌పల్లి నాలా తప్ప మిగతా నాలా ల నుంచి వచ్చే నీటిలో నాణ్యత పెరగడంపై అధికార యంత్రాంగం సంతృప్తి చెందుతోంది. సాగర్ మొత్తం జలాలను శుద్ధి చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ సుదీర్ఘకాల కసరత్తులో పూర్తిగా నిమగ్నమైంది. పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఇపిటిఆర్‌ఐ) సాగర్ జలాల నాణ్యతపై చేసిన పరిశోధనలో ప్రోత్సాహకర ఫలితాలు కనిపించాయి. కీలకమైన ప్రమాణాల అంశాల్లో చెప్పుకోదగిన అభివృద్ధి కనిపిస్తోందని, ముఖ్యంగా నీటిలో ప్రాణవాయువు (ఆక్సిజన్) విలీనం కావడమన్నది ప్రధాన అంశంగా సంస్థ పరిశీలకులు చెబుతున్నారు. సహజంగా పరిశుభ్రమైన నీటిలో లీటరుకు 5 మిల్లీ గ్రాముల వంతున ఆక్సిజను నీటిలో కరుగుతుంటేనే నాణ్యత ప్రమాణాలు బాగుంటాయి. కానీ కొన్నేళ్ల క్రితం వరకు ఆక్సిజను నీటిలో కరగడమే జరగక జీవం లేని జలాలయ్యాయి. దాని వల్ల హుస్సేన్‌సాగర్ జలాలు ఎందుకూ పనికి రాని మురికి కూపాలుగా మారాయి. అయితే తాజాగా పర్యావరణ పరిరక్షణ సంస్థ సేకరించిన నీటి నమునాల బట్టి సాగర్ నిదానంగా పరిశుభ్రతను నాణ్యతను సంతరించుకుంటోందని స్పష్టమైంది. నీటిలో ఆక్సిజను కరిగే స్థాయిలు పెరిగాయనీ హెచ్‌ఎండిఎకు చెందిన పర్యావరణ అధికారి ఆర్‌పి ఖజూరియా చెప్పారు. 2014 నవంబరు నాటి విశ్లేషణలో సాగర్‌కు జలాలను తీసుకువచ్చే నాలాల్లోని నీటి నమూనాలు సేకరించి పరీక్షించారు. బల్కపూర్ నాలాలో నీటిలో ఆక్సిజను కలిసే పాయింటు లీటరు నీటికి 5.60 మిల్లీ గ్రాముల వంతున ఉంది. బుద్ధ విగ్రహం దగ్గర లీటరు నీటిలో 5.20 మిల్లీ గ్రాముల వంతున ఆక్సిజను లుస్తోంది. పికెట్ నాలా దగ్గర లీటరుకు 5.40 మిల్లీ గ్రాముల వంతున కలుస్తుండగా, బంజారా నాలాలో లీటరుకు 3.80 మిల్లీగ్రాముల వంతున ఆక్సిజను లుస్తున్నట్టు తేలింది. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధారిటీ (బిపిపిఎ) కార్యాలయం దగ్గర నీటి అడ్డుకట్ట వద్ద సేకరించిన నమూనాలు పరీక్షించగా లీటరుకు 6.40 మిల్లీ గ్రాముల ఆక్సిజను నీటిలో కలుస్తుండడం విశేషం. అలాగే మారియట్ హోటల్ దగ్గర నీటి అడ్డుకట్ట ప్రాంతంలో లీటరు నీటిలో 5.80 మిల్లీ గ్రాముల ఆక్సిజను కలుస్తున్నట్టు స్పష్టమైంది. పక్షులు, జలచరాలు గతంలో వలే తిరిగి సాగర్ జలాల్లోకి రావడం ప్రారంభమైంది. దీన్ని బట్టి జలాలు మురికి నుంచి ముక్తి పొందుతున్నాయని నిర్ధారించవచ్చని ఖజూరియా చెప్పారు. అయితే ఈ ఆశావహతరుణంలో నిరుత్సాహం కలిగించేది కూకట్‌పల్లి నాలాయే. ఇక్కడ లీటరు నీటిలో 0.63 మిల్లీ గ్రాముల వంతున మాత్రమే ఆక్సిజను కలుస్తోంది. దీనికి కారణం కొన్నేళ్లుగా పరిశ్రమల నుంచి ప్రమాదకరమైన కాలుష్య అవశేషాలు విడుదలై వచ్చి నాలాలో చేరుతుండడమే. ఈ నాలాను పూర్తిగా తవ్వే కార్యక్రమం చేపడితే కానీ పరిస్థితి మెరుగుపడదని అధికార యంత్రాంగం భావిస్తోంది.
ప్రైవేటు సంస్థ ప్రయత్నం
టెక్‌సెలా అనే ప్రైవేట్ సంస్థ హుస్సేన్‌సాగర్ జలాలను శుద్ధి చేయడానికి సిద్ధమైంది. ఫతేనగర్ సూయెజ్ ప్లాంట్ వద్ద శుక్రవారం 25 వేల లీటర్ల సాగర్ జలాల నీటిని ప్రాక్టికల్‌గా శుద్ధి చేసింది. ఈ ప్లాంట్ దగ్గర నీటిని మంచినీళ్లలా మారే వరకు రసాయనాలతో శుద్ధి చేశారు. ఈ సంస్థ చేపట్టిన పైలట్‌ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు, వాణిజ్యపన్నుల మంత్రి టి.శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమల నుంచి రోజుకు 550 మిలియన్ లీటర్ల వ్యర్ధ జలాలు విడుదల అవుతున్నాయని వీటిలో 450 మిలియన్ లీటర్ల నీటిని మళ్లించడమవుతోందని, మిగతా 50 మిలియన్ లీటర్ల నీటిని సూయెజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ( ఎస్‌టిపి ) రోజూ శుద్ధి చేస్తున్నాయని ఆ శుద్ధి చేసిన 50 మిలియన్ లీటర్ల నీరే హుస్సేన్ సాగర్‌కు వెళ్తుందని చెప్పారు. టెక్‌సెలా సంస్థ ఉపాధ్యక్షుడు వెంకట్ మలపాక ఈ ప్లాంట్ విధానం వివరించారు. 24 గంటల పాటు నిరంతరం జలాలను శుద్ధి చేయడమవుతుందని అన్నారు. ఎక్కడా నీటి ప్రవాహాన్ని ఆపడం ఉండదని, ప్లాంటు ద్వారా శుద్ధి చేసిన నీరు వ్యవసాయానికి వినియోగించ వచ్చని తెలిపారు. ఈ సంస్థకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందని హెచ్‌ఎండిఎ చెబుతోంది.