ముషారఫ్‌ నామినేషన్‌ తిరస్కరణ


లాహోర్‌, ఏప్రిల్‌ 5 : పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రాంత పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థిగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్‌ పత్రాల్లో ముషారఫ్‌ సంతకం జాతీయ గుర్తింపు కార్డు మీదు ఉన్న సంతకంతో సరిపోలేదని పత్రాలను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి పేర్కొన్నారు. ముషారఫ్‌ అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక న్యాయవాది కేసు కూడా దాఖలు చేసినట్లు సమాచారం. ఇస్లామాబాద్‌లోని మరో పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా ముషారఫ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అక్కడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటి మీద ఎన్నికల సంఘం ఎప్పుడు విచారణ చేపట్టేది ఇంకా తెలియలేదు. ఆయన ఇటీవలే నాలుగేళ్ల ప్రవాస జీవితం అనంతరం సొంతగడ్డ పాక్‌పై అడుగుపెట్టారు. తనపార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన స్వదేశం తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.