మూడునెలల్లో జలపాతాల అభివృద్ది
నిర్మల్,సెప్టెంబర్11 ( జనంసాక్షి ) : ప్రముఖ పర్యాటక కేంద్రాలు కుంటాల, పొచ్చెర జలపాతాలను మరింత అభివృద్ధి చేస్తామని పర్యాటకశాఖ కార్పొరేషన్ ఎండీ మనోహర్‌రావు అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మంత్రి ఐకే రెడ్డి ఆదేశాల మేరకు నేరడిగొండ, బోథ్ మండలాల్లోని కుంటాల, పొచ్చెర జలపాతాలను అధికారులతో కలిసి పరిశీలించామని అన్నారు. మూడు నెలల్లో పొచ్చెర, కుంటాల జలపాతాల వద్ద అభివృద్ధి పనులు ప్రాంరంభిస్తామన్నారు. కుంటాల జలపాతం ప్రాంతంలో సహజ సిద్ధంగా ఉన్న ప్రకృతి సౌందర్యాలు ఏ మాత్రం దెబ్బ తినకుండా జలపాతం వద్ద అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి సూచించినట్లు చెప్పారు. అందుకే ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రణాళికలను రూపొందించనున్నట్లు వెల్లడించారు. జలపాతం వద్దకు వచ్చే పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందుకు తగిన సలహాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. లోతైన ప్రాంతాలను పూడ్చివేసే పక్రియ చేపట్టడంతో పాటు పునరావృతం కాకుండ శాశ్వత చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కుంటాల జలపాతం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం రోప్‌వే, చెక్‌డ్యాం నిర్మాణాలతో పాటు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. సస్పెన్షన్ బ్రిడ్జి, సాహస క్రీడలు, పిల్లలకు ఆటస్థలం, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు బోథ్ ఎక్స్‌రోడ్డు ప్రాంతంలో పర్యాటకులు విడిది చేసేందుకు హరిత¬టల్ నిర్మాణానికి, పొచ్చెర జలపాతం వద్ద లైట్లు అమర్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు.