మూడో రోజూ అదే జోరు

ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు
నిలకడగా ‘గుడియా’ ఆరోగ్యం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) :
చిన్నారి గుడియాపై అత్యాచారాన్ని నిరసిస్తూ ఆదివారం మూడో రోజూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగాయి. చిన్నారి కుటుంబానికి న్యాయం కావాలి, పోలీసు కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలి అంటూ యువత డిమాండు చేస్తోంది.  పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ వద్ద ఆందోళనను కొనసాగిస్తున్నారు. యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఇంటి వద్ద బిజెపి మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చట్టాలు చేయగానే సరిపోదని అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. అప్పటికే అక్కడికి చేరుకుని పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అత్యాచారాలు పెరిగిపోవడానికి  పోలీసుల అలసత్వమే కారణమని, రాజధానిలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరి నిరసనలతో ఢిల్లీ దద్దరిల్లింది. చిన్నారి కోలుకుంటోందని, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అవసరమైన సేవలన్నీ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. తమతో పాటు తల్లిదండ్రులతోనూ ఆమె మాట్లాడుతోందని ప్రాణానికి ప్రమాదం లేదని వారు పేర్కొన్నారు. మరో వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటుందని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. ఈమేరకు ఆదివారం జారీ చేసిన హెల్త్‌ బులెటెన్‌లో పేర్కొన్నారు.