మూవీ మొఘల్‌ రామానాయుడు ఇకలేరు

C

తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి

పలువురు ప్రముఖుల సంతాపం

నేడు సినిమాలు, షూటింగ్‌లు బంద్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జనంసాక్షి): తెలుగు చలనచిత్రపరిశ్ర మరో ప్రముఖుడిని కోల్పోయింది. వరుసగా తెలుగు సినిమా పరిశ్రమకు వరుసగా దెబ్బలు తలుగుతున్నాయి. ప్రముఖ చలన చిత్ర నిర్మాత రామానాయుడు కన్నుమూశారు. అత్యధిక చిత్రాలను నిర్మించి మూవీ మొఘల్‌ గా పేరు సంపాదించిన రామానాయుడు బుధవారం మృతి చెందారు. చిత్ర నిర్మాణంలో మేరునగధీరుడిగా పేరుపొందిన ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. శతాధిక చిత్రాల నిర్మాతగా పేరొందిన రామానాయుడు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు. భారతీయ భాషలన్నింటిలోనూ చిత్రాలు నిర్మించిన ఘనాపాఠి ఆయన. వివిధ భాషల్లో 135కు పైగా చిత్రాలు నిర్మించిన రామానాయుడిని మూవీ మొఘల్‌గా పేర్కొంటారు. టిడిపి నుంచి ఎంపిగా గెలిచి సొంత నియోజకవర్గానికి ఎంతో సేవచేశారు.  రామానాయుడు ప్రకాశం జిల్లా కారంచేడులో 1936 జూన్‌ 6న జన్మించారు. నమ్మినబంటు సినిమాలో చిన్న పాత్రలో తొలుత కనిపించిన రామానాయుడు ఆ తరవాత దేశం గర్వించదగగ్‌ నిర్మాతగా నిలిచారు. మూవీ మొగల్‌ రామానాయుడు వివిధ భాషల్లో 135కు పైగా సినిమాలు నిర్మించి అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో కెక్కాడు. తన సినీ ప్రయాణంలో దాదాసాహెబ్‌ పాల్కే అవార్డుతోపాటు సోగ్గాడు,జీవన తరంగాలు సినిమాలకుగాను ఆయన ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు అందుకున్నారు. అనురాగం చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన రామానాయుడు రాముడు-భీముడు సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారారు. ఎన్టీఆర్‌తో తీసిని ఈ చిత్రం విజయం సాదించింది. దీంతో ఇక ఆయన వెనక్కి తిరిగి చూడకుండా  ముందుకు సాగారు. తెలుగు, బెంగాలీ, ఇంగ్లీష్‌, పంజాబీ భాషల్లో చిత్రాలు నిర్మించి రికార్డు సృష్టించిన ఏకైక నిర్మాతగా పేరుగాంచారు. భారతీయ భాషలన్నింటిలో చిత్రనిర్మాణం చేపట్టిన ఏకైక నిర్మాతగా అత్యంత అరుదైన నిర్మాతగా పేరు సంపాదించారు. కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం ఆయనకు ఉన్న ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవాలి. గత కొంతకాలంగా కేన్సర్‌తో రామానాయుడు బాధపడుతున్నారు. బుధవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయనను ఆపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 1964లో సురేష్‌ ప్రొడక్షన్స్‌ను స్థాపించి తొలిచిత్రం రాముడు-భీముడు చిత్రాన్ని తెరకెక్కించి విజయం సాధించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై  దాదాపు 100కుపైగా చిత్రాలను ఆయన నిర్మించారు. నిర్మాతగానూ రామానాయుడు యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. భారతీయ భాషలన్నింటా చిత్రాలు నిర్మించిన ఏకైక నిర్మాతగా రామానాయుడు నిలిచిపోయారు. 13 భాషల్లో 150కి పైగా ఆయన చిత్రాలను నిర్మించారు. బెంగాల్‌లో తీసిన అశోక్‌ అనే చిత్రానికి గాను నేషనల్‌ అవార్డును అందుకున్నారు. అలాగే అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా రామానాయుడు గిన్నిస్‌రికార్డ్సులోకి ఎక్కారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుంచి దాదాపు 24 మంది దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలాగే అనేక మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆయనచే సినీ ఇండస్ట్రీకి పరిచయమై అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

2010లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును, 2013లో పద్మభూషన్‌ అవార్డులను ఆయన అందుకున్నారు. 2006లో రఘుపతి వెంకయ్య అవార్డును రామానాయుడు అందుకున్నారు. అలాగే శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీ వారు ఆయనను డాక్టరేట్‌గా సత్కరించారు. ఆయన నిర్మించిన జీవనతరంగాలు, సోగ్గాడు చిత్రాలకు గాను ఫిల్ఫ్‌ఫేర్‌ అవార్డులను అందుకున్నారు. ఆయన సినీ జీవితంలో 1971లో వచ్చిన ప్రేమ్‌నగర్‌ పెద్ద హిట్‌ను అందుకుంది. రామానాయుడు పెద్దకుమారుడు సురేష్‌ బాబు టాలీవుడ్‌లో నిర్మాతగా కొనసాగుతుండగా, రెండో కుమారుడు వెంకటేష్‌ హీరోగా కొనసాగుతున్నారు. రామానాయుడు మరణవార్తతో తెలుగు పరిశ్రమలో విషాదం నెలకొంది.

సిఎం కెసిఆర్‌ సంతాపం

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. క్యాన్సర్‌ వ్యాధిభారిన పడిన ఆయన పరిస్థితి విషమించడంతో నేడు మృతిచెందారు. పలువురు రాజకీయ, చిత్రసీమకు చెందిన ప్రముఖులు రామానాయుడు మృతికి సంతాపం తెలిపారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ పలువురు కొనియాడారు. నాయుడు మృతికి ఎపి సిఎం చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మ¬న్నత వ్యక్తిత్వం ఉన్నవాడని కొనియాడారు. టిడిపి ఎంపిగా ఆయన నియోజకవర్గానికి ఎనలేని సేవచేశారని అన్నారు. ఆయన మృతి తెలుగుపరిశ్రమకు తీరని లోటన్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ పూర్తిగా విషాదంలో మునిగింది. సూపర్‌స్టార్‌ కృష్ణ, చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్‌, పవన్‌కళ్యాణ్‌, మహేష్‌, విజయనిర్మల, జయసుధ , జీవితతో పాటు పలువురు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

రామానాయుడు స్టూడియోలో భౌతిక కాయం

నేడు మధ్యాహ్నం అంత్యక్రియలు: వెంకటేశ్‌

మూవీ మొఘల్‌ రామానాయుడు మృతిపట్ల ఆయన చిన్న కుమారుడు, ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్‌ విూడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తమ తండ్రి రామానాయుడు కన్నుమూశారని ఆయన తెలిపారు. కొద్దినెలలుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలిపారు. ఆస్పత్రికి తీసుకుని వెల్లగా అప్పటికే మృతి చెందారని డాక్టర్లు తెలిపారన్నారు. గురువారం  మధ్యాహ్నం తర్వాత ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామన్నారు. ప్రజల సందర్శనార్థం  రామానాయుడు స్టూడియోలో ఆయన పార్థివదేహాన్ని ఉంచుతామని వెంకటేశ్‌ తెలిపారు. రామానాయుడుకు ఇద్దరుకుమారులు. పెద్దకుమారుడు సురేశ్‌ బాబు నిర్మాతగా ఉండగా చిన్న కొడుకు వెంకటేశ్‌ కథానాయకుడు. ఆయన మృతితో చిత్రపరిశ్రమలో విషాదం అలముకుంది. 13 భాషల్లో 150కు పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు ఎన్నో అవార్డులు వరించాయి.

తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.  1999లో బాపట్ల నుంచి తెదేపా తరఫనె ఎంపీగా గెలుపొందారు.  2003లో బెస్ట్‌  పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్నారు. 2009లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు లభించింది.  2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.  అత్యధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు పొందారు.  ఆయన తీసిన ‘ప్రేమించు’ సినిమాకు 5 నంది అవార్డులు లభించాయి.  రామానాయుడు తీసిన బెంగాలీ చిత్రం ‘అసుర’ జాతీయ ఉత్తమ చలనచిత్రం అవార్డు గెలుచుకుంది. దక్షిణాది చిత్ర ప్రముఖునిగా ఆయనకు ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది.

12 మంది హీరోయిన్లు, ఏడుగురు సంగీత దర్శకులను చిత్రరంగానికి పరిచయం చేసిన మూవీ మొఘల్‌ 21 మంది కొత్త దర్శకుల్ని, ఆరుగురు హీరోలను పరిచయం చేశారు.  చిత్రపరిశ్రమకు సంబంధించి స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌, డిసిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్‌ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌ రంగాల్లో ఆయన సేవలందించారు.  పలు నవలలకు చలన చిత్రాలుగా దృశ్యరూపమిచ్చిన ఘనత రామానాయుడిదే.ఇక విశాఖలో కూడా చిత్రపరిశ్రమకు చేయూతను ఇచ్చేందుకు అక్కడా స్టూడియో నిర్మించారు.

నేడు చిత్రపరిశ్రమ బంద్‌ …థియేటర్లు కూడా : దాసరి

రామానాయుడు మృతికి సంతాపసూచకంగా గురువారం తెలుగు సినిమా పరిశ్రమ బంద్‌ పాటించి అంజలి ఘటించనున్నట్లు దర్శకరత్న దాసరి నారాయణ తెలిపారు. ఇందులో భాగంగా సినిమాహాళ్లు కూడా బంద్‌ పాటిస్తాయని అన్నారు.  రామానాయుడు పార్ధీవ దేహాన్ని సందర్శించిన అనంతరం విూడియాతో మాట్లాడారు.  ‘స్వర్ణయుగంలో వచ్చాం, స్వర్ణయుగంలో పెరిగాం. ఆ స్వర్ణయుగం తెర పడిపోతోందని భయం వేస్తోందని దాసరి ఆవేదన చెందారు.  తెలుగు సినిమా పరిశ్రమ జాతీయ స్థాయిలో ఉండాలని కోరుకున్న నేతలు ఒక్కొక్కరు కనుమరుగవుతున్నాందుకు . చాలా బాధగా వుందన్నారు. . రామానాయుడు ఒక వ్యవస్థ.. ఒక సింగిల్‌ కాదు.. భారతీయ సినిమాకు సినీ మొఘల్‌ రామానాయుడు. అందర్నీ నవ్వించే వ్యక్తి రామానాయుడు వెళ్లిపోయాడన్నారు.  సినీ నిర్మాణ విధానాన్ని నేర్చుకుంటూ సినీ కుటుంబానికి బాసటగా నిలవాలని కోరుకుంటున్నానని తెలిపారు. రామానాయుడు మృతి తెలుగు సినిమా పరిశ్రమకు ఒక దుర్ధినం అని చిరంజీవి అన్నారు. రామానాయుడి పార్థీవ దేహాన్ని సందర్శించిన అనంతరం విూడియాతో మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమకు నిలువెత్తు నిదర్శనం.. సినిమాకు పర్యాయపదంగా ఉన్న రామానాయుడు ఇక లేరు అనే చేదు వార్తను జీర్ణించుకోవడం కష్టం అన్నారు. సినిమా పరిశ్రమకు రామానాయుడు దేవుడి లాంటి వాడని… అలాంటి దేవుడు దేవుడి వద్దకు వెళ్లాడంటే తట్టుకోలేకపోతున్నామని తెలిపారు. దేవుడు ఉన్నంత కాలం తలుచుకుంటూ ఉంటామని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని పేర్కొన్నారు.  రామానాయుడు లేరు అంటే ఎంతో బాధగా వుందని

ప్రముఖ నిర్మాత, ఎంపి టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు.  రామానాయుడుతో తనది 50 సంవత్సరాల అనుబంధం అని గుర్తు చేసుకున్నారు. రామానాయుడి మృతి తెలుగు పరిశ్రమే కాదు, జాతీయ సినిమా పరిశ్రమ బాధపడుతోందని చెప్పారు. ప్రముఖ నిర్మాణత రామానాయుడు ఎప్పుడూ ప్రొడ్యూసర్‌ లా ఫీలవ్వలేదని నిర్మాత కోదండరామిరెడ్డి అన్నారు. రామానాయుడు ప్రొడ్యూసర్‌ అని ఫీలవ్వకుండా ఒక కూలీలాగా పనిచేశారని.. అదే ఆయన సక్స్‌ స్‌ కు కారణం. సినీ పరిశ్రమలో ఏ ప్రాబ్లం వచ్చినా స్పందించేవారని.. ఎక్కడ వున్నా మంచి మనసుతో పలికరించి, పోత్సహించే వ్యక్తి రామానాయుడు అని ఇప్పుడు ఆయన మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకుశాంతి కలగాలని కోరుకుంటున్నానుఅని తెలిపారు.