మూసీ బ్రిడ్జి నిర్మాణంతో తీరనున్న కష్టాలు
నల్లగొండ,జనవరి24(జనంసాక్షి):మూడు జిల్లాల ప్రజల రవాణాకు అడ్డుగా ఉన్న మూసీ నదిపై బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. మూసీపై బ్రిడ్జి నిర్మించాలని అనేక సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ జిల్లా మంత్రి సహకారంలో సీఎం కేసీఆర్‌ను ఒప్పించి బ్రిడ్జి నిర్మాణానికి నిధులను మంజూరు చేయించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రిడ్జి నిర్మాణానికి రూ. 16 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం మూసీ నీరు తగ్గుముఖం పట్టడంతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆయా గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. శాలిగౌరారం మండలం గురజాల-మానాయికుంట గ్రామాల మధ్య మూసీ నదిపై బ్రిడ్జి లేక పోవడంతో నల్లగొండ, వరంగల్‌తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో వర్షాకాలంలో నది దాటి పోలేక పక్కనున్న గ్రామానికి వెళ్లాలన్నా సుమారు 60 కిలోవిూటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం మూసీలో మట్టి రోడ్డు వేసే పనులను చేస్తుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హావిూ మేరకు గురజాల, మానాయికుంట గ్రామాల మధ్యన ఉన్న మూసీ ఏటిపై బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేశాను. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పందించి నిధులు మంజూరు చేశారు. బ్రిడ్జి నిర్మాణానానికి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరువ తీసుకున్నారు. నిధులు మంజూరు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పనులు కాస్త ఆలస్యమయ్యాయి. కానీ ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ చేరవేసేందుకు అవసరమైన రోడ్డు పనులు జరుగుతున్నాయి. మూసీ ఏటిపై బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నాలుగు జిల్లాల ప్రజల ఇబ్బందులు తీరనున్నాయి. సూర్యాపేట, యాదాద్రిభువనగిరి, వరంగల్ జిల్లాలకు అనుసంధానంగా ఉన్న ఈ రోడ్డు ద్వారా ఆయా గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో సుమారు నాలుగు నెలల పాటు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో శాలిగౌరారం, తిరుమలగిరి, మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన పలు గ్రామాలకు రవాణా సౌకర్యం ఉండదు. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు నకిరేకల్, సూర్యాపేట విూదుగా తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీంతో 15 కిలోవిూటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లేందుకు సుమారు 60 కిలోవిూటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుంది. కొందరు ఏటిలోంచి తమ వాహనాలను నెట్టుకుంటూ ఏరుదాటే ప్రయత్నం చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.