మేం మైనార్టీ కాదు

తమిళుల ఊచకోతపై జరగాల్సిందే : కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ, మార్చి 20 ((టన్శసలక్ఞ్ష) )  డీఎంకే మద్దతు ఉపసంహరణతో ఆత్మరక్షణలో పడిన ప్రభుత్వం.. బల నిరూపణకు సిద్ధమైని ప్రకటించింది. తమకు పూర్తి మెజార్టీ ఉందని.. ఏ రాజకీయ పార్టీ కూడా తమ మెజార్టీని ప్రశ్నించజాలని తెలిపింది. ప్రభుత్వ మనుగడకు వచ్చిన ముప్పేవిూ లేదని స్పష్టం చేసింది. అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెట్టుకోవచ్చని, బల నిరూపణకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. శ్రీలంక తమిళుల అంశంపై పార్లమెంట్‌లో తీర్మానం చేసేందుకు అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని, చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. శ్రీలంకలో యుద్ధ నేరాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో తీర్మానం కోరతామని ప్రకటించింది. తమిళుల హక్కుల ఉల్లంఘనపై స్వాతంత్ర న్యాయ విచారణ జరిగాల్సిందేనని పేర్కొంది. తీర్మానానికి, డీఎంకే వైదొలగడానికి సంబంధం లేదని.. లంకలోని తమిళులు తమ ఆప్తులేనని పేర్కొంది. ఒత్తిడి మేరకే తీర్మానం చేయాలన యూపీఏ ప్రభుత్వానికి ఢోకా లేదని కేంద్ర మంత్రులు కమల్‌నాథ్‌, చిదంబరం స్పష్టం చేశారు. ప్రభుత్వం పూర్తి మెజార్టీతో ఉందని, లోక్‌సభలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బుధవారం ఉదయం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్థిక మంత్రి చిదంబరం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌, సమాచార శాఖ మంత్రి మనీశ్‌ తివారీ విలేకరులతో మాట్లాడారు. శ్రీలంక తమిళుల అంశంపై ప్రతిపాదిత తీర్మానానికి, డీఎంకే ఉపసంహరణకు సంబంధం లేదని చిదంబరం అన్నారు. తమిళుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం తీర్మానం చేసేందుకు యత్నిస్తోందని తెలిపారు. లంకలోని తమిళులు తమ ఆత్మీయులేనన్నారు. లంకలో తమిళుల అంశంపై కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ  భేటీలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రస్తావించారన్నారు. శ్రీలంకలో తమిళుల అంశంపై పార్లమెంట్‌లో తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. లంక యుద్ద నేరాలపై ఐరాసలో తీర్మానం కోరతామన్నారు. అమెరికా తీర్మానంలో సవరణలు కోరతామని, సవరణలను మంగళవారం ఖరారు చేశామన్నారు. అమెరికా తీర్మానంలోని కఠిన పదాలను తొలగించి తీర్మానాన్ని నీరుగార్చారని వచ్చిన వార్తలను చిదంబరం కొట్టిపడేశారు. లంకలో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన దర్యాప్తు కోరతామని వెల్లడించారు.డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి ప్రధానికి రాసిన లేఖపై ఈ నెల 18న చెన్నై వెళ్లి కరుణానిధితో చర్చించామని వివరించారు. ఈ అంశంపై డీఎంకేతో చర్చలు జరిపినా.. ఆ పార్టీ తన వైఖరి ఎందుకు మార్చుకుందో తెలియట్లేదన్నారు. డీఎంకే నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. ప్రభుత్వం స్థిరంగా ఉందని, దానిపై అనుమానాలు అక్కర్లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ‘ప్రభుత్వం స్థిరంగా ఉంది. మా సుస్థిరత గురించి ఎవరు ప్రశ్నించనక్కర్లేదు’ అని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతున్నామని, ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. మధ్యంతర ఎన్నికలకు వెళ్తారా..? అన్న ప్రశ్నకు సూటిగా స్పందించలేదు.ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని మంత్రి కమల్‌నాథ్‌ స్పష్టం చేశారు. తమది కుంటి ప్రభుత్వం కాదని, ఎవరి సహాయం అక్కర్లేదన్నారు. ‘మాది సుస్థిరమైన ప్రభుత్వం. ఏ రాజకీయ పార్టీ మా మెజార్టీని ప్రశ్నించజాలదు’ అని వ్యాఖ్యానించారు. అయితే, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ప్రభుత్వంలో చేరవచ్చని, అన్ని పార్టీలకు ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. ఓ రాష్టాన్రికి చెందిన ప్రజల మనోభావాలను గుర్తించడం ప్రభుత్వ విధి అని మనీశ్‌ తివారీ పేర్కొన్నారు. తీర్మానం చేసే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.