మే నుంచి తెలంగాణలో కరెంటు కోతలుండవు
-తెలంగాణ ఇచ్చింది సోనియానే, తెచ్చుకుంది తెలంగాణ ప్రజలే
-సోనియా పేరు రాయకుండా తెలంగాణ పేరు లిఖించలేం
– లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తాం
– త్వరలో హైకోర్టు విభజన
– మండలిలో సీఎం కేసీఆర్
హైదరాబాద్,మార్చి14(జనంసాక్షి): తెలంగాణలో మే నెల నుంచి కరెంటు కోతలుండవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం శాసనమండలి ప్రభుత్వ పథకాలపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు.తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సోనియా చొరవతనే వచ్చిందనడంలో సందేహం లేదు.. కానీ తెచ్చిందెవరో కూడా చెప్పాలి. అందరం కలసి తెలంగాణ తెచ్చకున్నాం.. అందరం కలసి అభివృద్ది చేసుకుందాం అని సిఎం కెసిఆర్ మండలిలో చెప్పారు. సుదీర్ఘంగా ఆయన వివిధ అంశాలపై తన వివరణ ఇచ్చారు. ప్రాజెక్టుల రీడిజైన్ జరగాల్సిందే అని పునరుద్ఘాటించారు. లక్ష ఉద్యోగాల నియామకం… హైకోర్టు విభజన, ప్రజాప్రతినిధులకు గౌరవ వేత నాల పెంపు తదితర అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. శనివారం శాసన మండలిలో ఆయన ప్రభుత్వ పథకాలను వివరించారు. దేశంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, కేంద్రం ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ పథకం తెచ్చిందన్నారు. దీనివల్ల సిఎంల ప్రాధాన్యం పెరిగి రాష్టాల్రకు విలువ చ్చిందన్నారు. అనేక కేంద్ర పథకాలు పరికి రాకుండా ఉం డగా వాటిని తొలగించాలని చేసిన సూచనను నీతి ఆయోగ్ ఆమోదిం చిందన్నారు. నిబంధనలు పెట్టకుండా కేంద్రం నిధులు విడుదల చేయాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో ఉన్న 122 పథకాలను 66 పథకాలు చేయ నున్నట్లు కేసీఆర్ తెలిపారు. గతంలో రాష్టాల్రు అంటే చాలా చిన్న చూపు ఉండేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కేంద్రం నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు. రుణపరిమితిని కూడా కేంద్రం పెంచిందన్నారు. ఈ దశలో విపక్షనేత డి.శ్రీనివాస్ మాట్లాడుతూ కేద్రం తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో సిఎం సుదీర్ఘగా సమాధానం ఇచ్చారు.
ఇక కరెంట్ కోతలు ఉండవన్న సిఎం
రాష్ట్రంలో వచ్చే మే తరవాత కరెంట్ కోతలుండవని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఉంటేగింటే అంటూ అసలు ఉండబోవన్నారు. ఆ మేర కు విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్ కోతలు లేవని స్పష్టంచేశారు. గతేడాది ఇదే సమ యానికి కోతలు ఉన్నాయి… పరిశ్రమల యజమానులు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారని గుర్తు చేశారు. శాసనమండలిలో సీఎం విద్యుత్ సమస్యపై స్పందిస్తూ… హిందూజా, కృష్ణపట్నం నుంచి మనకు రావాల్సిన వాటా ఏపీ ఇవ్వలేదు. కేంద్రం మొట్టికాయలేసి లిఖిత పూర్వక ఆదేశాలిచ్చినా బాబు పట్టించుకోలేదు. ఇప్పడు చంద్రబాబు కరెంట్ ఇస్తామన్నా తీసుకోమని కూడా పునరుద్ఘాటించారు. కరెంట్ వినియోగం ఉత్పత్తిపై ప్రతి నిమిషం మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు. మే నెల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలుండవు. ఒకవేళ ఉన్నా అతి స్వల్పంగానే ఉంటాయన్నారు. అది కూడా సరఫరాలో తలెత్తే సమస్యల వల్లే ఉంటుందన్నారు. వ్యవసా యానికి కావాల్సిన కరెంట్ 2200 నుంచి 2500 మెగావాట్లు. ప్రైవేట్ సెక్టార్‌కు కరెంట్ ఉత్పత్తి ఇవ్వబోమని తెగేసి చెప్పి అదేవిధంగా ముందుకు వెళ్లాం. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తాడిచర్ల బొగ్గుగని మనకు కాకుండా పోయింది. తాడిచర్ల బొగ్గుగని కోసం తిరిగి దరఖాస్తు చేశాం. వస్తుందన్న ఆ శలో ఉన్నాం. 2016 నుంచి రైతులకు ఉదయం 9 గంటల నుంచి సా యంత్రం 6 గంటల వరకు కరెంట్ ఇస్తం. 2017 పూర్తయ్యేనాటికి అన్ని సెక్టార్లకు 24 గంటలు కరెంట్ ఇస్తామని సీఎం పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని సిఎంగా సభకు హావిూ ఇస్తున్నామని చెప్పారు. గత ఏడాది కరెంటు సంక్షోభంలో ఉన్నప్పుడు ఎపి కరెంటు ఇవ్వల ేదని, ఈ ఏడాది ఇంతవరకు కరెంటు కోతలు లేవని,కెసిఆర్ చెప్పారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పట్లో చట్టం ప్రకారం కరెంటు ఇవ్వలేదని,ఇప్పుడు అది మన మంచికే అయిందని అన్నారు.లేకుంటే తెలంగాణ అదనపు భారం మోయవలసి వచ్చేదని ఆయన అన్నారు.గాయత్రి పవర్ ద్వారా అదనపు విద్యుత్ వస్తోందని, గ్యాస్ కేటాయింపు వల్ల విద్యుత్ అదనంగా రాబోతున్నదని అన్నారు. భగవంతుడి దయ, అందరి సహకారం వల్ల ఇది సాధ్యమైందని అన్నారు . ఈ ఏడాది విద్యుత్ కోత ఉండబోదని,ఒక వేళ మూడు నాలుగు రోజులు,పంటల రక్షణకు అవసరమైన మేర కొద్దిగా ఉండవచ్చని,అంతే తప్ప విద్యుత్ కోత ఉండకపోవచ్చని అన్నారు. ముందు జాగ్రత్తగా మాత్రమే కొద్ది కరెంటు కోత ఉండవచ్చని అంటున్నానని, మే నెల తర్వాత కరెంటు కోత ఉండబోదని కెసిఆర్ అన్నారు. నిబద్దతతో చేస్తే చేయవచ్చని రుజువు అయిందని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలకు విద్యుత్ ఉత్పత్తి అవకాశం ఇచ్చామని అన్నారు.
రీ ఇంజనీరింగ్ చేయాల్సిందే
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేయాలని సీఎం కేసీఆర్ మరోమారు తెలిపారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం శాసనమండలిలో మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ వేరు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వేరు. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ పరిహాసంగా మారయన్నారు. గత పాలనలో ఏ ప్రాజెక్టు చూసినా గోల్‌మాలే. తెలంగాణ ప్రాజెక్టులను రీ ఇంజినీరింగ్ చేయాలి. ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా పనులను యుద్ధప్రాతిపదికన చేయాల్సిందే. రెండు మూడు రోజుల్లో అన్ని పార్టీల నేతలం కూర్చొని ప్రాజెక్టులపై స్టడీ చేద్దాంమని ఆయన తెలిపారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులన్నింటిపైనా పూర్తిస్థాయి సవిూక్ష అవసరమని, రీ ఇంజినీరింగ్ జరగాలని గోదావరి, కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్మాణం, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటి సత్వర వినియోగానికి అవసరమైన మార్పులు, చేర్పులపై ఆయా ప్రాజెక్టుల పరిధిలోని శాసనసభ్యులతో శాసనసభ సమావేశాల తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తుందన్నారు. నాగార్జునసాగర్ నిర్మాణం నుంచి ప్రాణహిత చేవెళ్ల వరకూ ప్రతి ప్రాజెక్టులోనూ పక్షపాతంతో ఆంధ్రా పాలకులు.. తెలంగాణకు ద్రోహం చేస్తూనే వచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఉన్నపుడు ఇంజినీరు కోటిరెడ్డితో కలిసి నిర్మించిన ఎస్సారెస్పీ తప్ప అన్ని ప్రాజెక్టుల్లో ద్రోహం జరిగిందన్నారు. ప్రాణహిత చేవెళ్లపైనా అనవసరంగా ఖర్చు చేశారని అన్నారు. తాను ఇటీవల మహారాష్ట్ర సిఎంను కలిసినప్పుడు 150 టిఎంసిల నీరు వాడకోవడానికి అభ్యంతరం లేదని మహా సిఎం చెప్పారని, అయితే ముంపు ప్రాంతాలపై అభ్యంతరం చెప్పారన్నారు. దీంతో కాళేశ్వరం దిగువన ఇప్పుడు సర్వే చేస్తున్నామని అన్నారు. మహారాష్ట్రతో నీటి అవగాహన ఒప్పందాలు ఉన్నాయి.. కానీ, ఎక్కడ నిర్మించుకోవాలనేది ఒప్పందంలోనే లేదని, అందుకే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. వీటన్నిటిని గమనించి రీ ఇంజనీరింగ్‌పై చర్చించాలని నిర్ణయించామని అన్నారు. మిషన్ కాకతీయకు నాబార్డ్ వెయ్యి కోట్లు. జైకా రూ. 3 వేల కోట్లు ఇస్తున్నయి. వాటర్‌గ్రిడ్‌కు రూ. 10 వేల కోట్లు ఇచ్చేందుకు హడ్కో ముందుకు వచ్చింది.
15 రోజుల్లో హైకోర్టు విభజన
రానున్న 15 రోజుల్లో హైకోర్టు విభజన జరగనున్నదన్న విశ్వాసాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైకోర్టు విభజన జరగకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడను తెలంగాణ లాయర్లు కలిశారు. హైకోర్టు విభజనకు సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవించారు. ఈ మేరకు ఆయన నుంచి హామి పొందారు. హైకోర్టు విభజన జరగందే రాష్ట్ర విభజన పూర్తి కానట్లుగా అందరూ భావిస్తున్నారు. ఈ విషయమై త్వరలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ను కలుస్తాను. హైకోర్టు విభజనపై అతిత్వరలోనే అందరం తీపీ కబురు వింటమని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు విషయంలో న్యాయశాఖ, ప్రధానికి ఇబ్బందులు చెప్పాం… త్వరలోనే తీపకబురు వస్తుందని చెప్పారు.
స్థానిక ప్రతినిధుల గౌరవం పెంచుతాం
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవాన్ని పెంపొదిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సర్పంచ్‌లకు అధిక వేతనం విషయంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఇది తొలి అడుగని అన్నారు. మనదగ్గర సర్పంచ్లు ఎంపిటిసిల సంఖ్య ఎక్కువన్నారు. అయినా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్టాన్రికి రావాల్సిన నిధులను సాధించేందుకు రెండు మూడ్రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అవసరమైతే అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. అంతకు ముందు మండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ మాట్లాడుతూ… రాష్ట్ర బ్జడెట్ అస్పష్టంగా ఉందన్నారు. బ్జడెట్‌లో బీసీలను నిర్లక్ష్యం చేసినట్లు కనిపిపిస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కేంద్రం సహకారం ఎంతో అవసరం, ప్రస్తుతం కేంద్రం వైఖరి చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. యువకుల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. అవసరమైతే వయసు పరిమితి సడలించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. దీనికి సెం సానుకూలంగా స్పందించి లక్ష ఉద్యోగల కల్పనకు కట్టుబడి ఉన్నామని అన్నారు. డిఎస్సీ అనేది ఉద్యోగాల అవసరం కోసమే తప్ప ఉద్యోగాల కోసం డిఎస్సీ ఉండదని స్పష్టం చేశారు. అయితే ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు.
త్వరలోనే లక్ష ఉద్యోగాల భర్తీ: సిఎం కెసిఆర్
త్వరలోనే రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శాసనమండలిలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారు. విద్యార్థులకు న్యాయం జరగాల్సిందే. కమలనాథన్ కమిటీ నివేదిక పూర్తయిన తర్వాత ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యమంలో వారు నిర్వహించిన పాత్రను ఎవరూ మరువలేరన్నారు. ఉద్యోగుల విభజన అనంతరం సత్వర నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. . ఇప్పటికే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 3726 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చామన్నారు. అదేవిధంగా 600 ఇంజనీరింగ్ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేవామన్నారు. ఉర్దూ విూడియం పాఠశాలల్లో దాదాపు 1500 మంది టీచర్ల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై కూడా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఉద్యోగాల కోసం డీఎస్సీ ఉండదన్నారు. . పిల్లల చదువుల కోసం డీఎస్సీ ఉంటుందన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యా వ్యవస్థలో మార్పుల అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. . వయోపరిమితిని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగులకు వయసు సడలింపును ఇచ్చి రిక్రూట్‌మెంట్లలో అవకాశం కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. విద్యారంగంలో ఉన్న ఖాళీల మేరకు అవసరమైతు డిఎస్సీ నిర్వహిస్తామని అన్నారు.
సోనియా పేరు రాయకుండా తెలంగాణ చరిత్ర లేదు: కెసిఆర్
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దయవల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సోనియా ఇచ్చింది నిజమే అయినా తెచ్చింది ఎవరు.. అన్న సిఎం కెసిఆర్ అందిరి పోరాటం వల్లనే తెలంగాణ ఏర్పడిందన్నారు. అయితే మద్దతు ఇచ్చిన బిజెపిని మాత్రం ఎక్కడా ప్రస్తావించకుండా మరచిపోయారు. కాంగ్రెస్‌లో ఉన్న వారు కూడా చాలామంది ఆనాటి ఆంద్రా ముఖ్యమంత్రలుకు వ్యతిరేకంగా పోరాడారని కితాబునిచ్చారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం పలు అంశాలను స్పృశిస్తూ మట్లాడారు. అంతకు ముందు కాంగ్రెస్ సభ్యుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ సోనియా దయవల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. తమపై వ్యతిరేకతతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాలేదని, తెలంగాణ వచ్చిన సందర్భంలో దానికి పట్టం కట్టారని అన్నారు. దీనిపై సీఎం కెసిఆర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ అంటున్నట్లుగా తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ దయతోనే ఏర్పడింది. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలు, అనుమానాలు అక్కర్లేదన్నారు. ఆమె చొరవతోనే అనకతప్పదన్నారు. తెలంగాణ చరిత్ర ఎవరూ రాసిన రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పాత్రను విస్మరించలేరు. కానీ రాష్ట్రం ఇచ్చింది సోనియా అయితే తెచ్చింది ఎవరో కూడా కాంగ్రెస్ చెప్పాలి కదా… విజ్ఞత రెండు వైపుల ఉండాలి కదా.. అని సీఎం కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి చెప్పారు. ఈ సందర్భంగా కొందరు టీఆర్‌ఎస్ సభ్యులు కేసీఆర్.. టీఆర్‌ఎస్ అని చెప్పారు… విూరు కాదు.. పెద్దలు డి.శ్రీనివాస్ చెప్పాలని కేసీఆర్ నవ్వుతూ అన్నారు. అయితే ఆనాడు అందరూ ఉద్యమం చేశారని అన్నారు. తాను ఆమరణ దీక్షకు వెళ్లే వరకు విద్యార్థులను ఉద్యమం లోకి రాకుండా చూసుకున్నానని అన్నారు. విద్యార్థులు వస్తే ఆవేశంలో హింసకు పాల్పడే అవకశం ఉందని అన్నారు. అయితే ఆ తరవాత అందరూ ఉద్యమించారని చెప్పారు.