మే 9న చైనాలో పర్యటిస్తా

చర్చలతో ఉద్రిక్తత పరిష్కారం
ఖుర్షీద్‌ ఆశాభావం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి):
భారత్‌-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న తరుణంలోనూ పొరుగు దేశంతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 15న లడఖ్‌ ప్రాంతంలో చైనా సేనలు మన భూభాగంలోకి చొరబడడంతో ఉద్రిక్తత తలెత్తింది. వెనక్కు వెళ్లాలని భారత్‌ చేసిన విజ్ఞప్తిని చైనా తోసిపుచ్చింది. అది తమ భూభాగమేనని స్పష్టం చేయడంతో సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతల నివారణకు కేంద్ర ప్రభుత్వం సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. మే 9 నుంచి విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చైనాలో పర్యటించనున్నారు. చైనా సరిహద్దుల్లో భారత సైన్యం చైనాతో పోరాడుతోందని అయినా సరే తాను చైనాలో పర్యటిస్తానని ఖుర్షీద్‌ చెప్పారు. ఇదిలా ఉంటే, సరిహద్దుల్లో పరిస్థితిపై ఆర్మీ చీఫ్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిక్రమ్‌సింగ్‌ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీకి వివరణ ఇచ్చారు. గురువారం ఉదయం ఆయన ఆంటోనీతో సమావేశమయ్యారు. చైనా చొరబాటుకు యత్నించిన పూర్తి వివరాలు అందజేశారు. మరోవైపు, తాజా పరిణామాలు భారత్‌తో సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోవని చైనా తెలిపింది.భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉన్నా సరే తాను చైనాలో పర్యటిస్తానని సల్మాన్‌ ఖుర్షీద్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలం నుంచి జరుగుతోన్న చర్చలను తోసిపుచ్చలేమన్నారు. చైనాతో చర్చలు జరపబోతున్నాం కాబట్టి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నానని, చైనాతో మరోసారి ఈ విషయమై చర్చించే అవకాశం చిక్కిందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు చర్చలతో పరిష్కరించుకున్నామని గుర్తు చేశారు. ఏ అంశంపైనైనా ఏకపక్షంగా అంగీకారం రాలేమని వ్యాఖ్యానించారు.జమ్మూకాశ్మీర్‌, లడక్‌లోని తాజా పరిస్థితులపై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిక్రమ్‌సింగ్‌ గురువారం రక్షణ శాఖ మంత్రి ఆంటోనీకి వివరణ ఇచ్చారు. భారత భూభాగంలోకి చైనా చొరబాటు, ప్రస్తుత పరిణామాలపై పూర్తి వివరాలు తెలిపారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో.. జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాల్లో పరిస్థితులపై బుధవారం మిలిటరీ కమాండర్లతో నార్తర్న్‌ కమాండ్‌లో సవిూక్షించిన సింగ్‌.. ఆంటోనీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జాతీయ భద్రతా సలహా మండలి నేతృత్వంలోని చైనా స్టడీ గ్రూప్‌ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసినట్లు తెలిసింది. ప్రస్తుత ఉద్రిక్తతలను నివారించేందుకు సైన్యాన్ని మోహరించడంతో పాటు పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు ప్రధాని కార్యాలయంతో పాటు రక్షణ శాఖతో చైనా స్టడీ గ్రూప్‌ చర్చిస్తున్నట్లు తెలిసింది.