మొగున్నే కొట్టి మొగసాలకెక్కినట్టు…
‘మొగున్నే కొట్టి మొగసాలకెక్కినట్టు’గా ఉంది సీమాంధ్ర నేతల తీరు. గుండెమండి తెలంగాణ ప్రాంత నేతలు మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నరు. ఏకంగా పాలకపక్షమే తెలంగాణవాదులపై కేసులు బనాయించి లోపల వేసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. కానీ వారు ఇక్కడ గుర్తించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఉద్యమాలు చేయడం, కేసుల పాలవడం, జైళ్లకు వెళ్లడం, బయటికి వచ్చి మళ్లీ ఉద్యమ బాట పట్టడం తెలంగాణ ప్రజలకు కొత్తకాదు. ఇక్కడి ప్రజల జీవన విధానంలోనే పోరాట పంథా స్పష్టంగా కనిపిస్తోంది. తరతరాల అణచివేతలపై ఎప్పటికప్పుడు సమరశంఖారావం పూరించిన చరిత మనది. ఇప్పుడు సీమాంధ్రుల కారుకూతలకు, తాటాకు చప్పుళ్లకు బయపడేది లేదు. మనది ఆత్మగౌరవ పోరాటం. స్వపరిపాలన కోసం నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం. ఉమ్మడి పాలనలో కోల్పోయిన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, నీళ్లు, నిధులు, సహజ వనరులను తిరిగి దక్కించుకోవాలని సాగిస్తున్న న్యాయ పోరాటం. తెలంగాణ ఉద్యమం ఎవరో చెబితే చేస్తున్నది కాదు. ఎవరో మనుషుల్ని తరలించి సాగించే కూలి ఉద్యమం కాదు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే వెయ్యి మంది తెలంగాణ విద్యార్థులు, యువకులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇక్కడి ప్రజలు ఎంతటి సున్నిత మనస్కులో అర్థమవుతుంది. అలాంటి వారిని పట్టుకొని సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు నానా మాటలు అంటున్నా ఇక్కడి మంత్రులు కనీసం స్పందించలేదు. ఆత్మబలిదానాలను తక్కువ చేసి మాట్లాడినా పదవులు పట్టుకొని వేలాడారే తప్ప ఎందుకిలా అన్నారని కూడా ప్రశ్నించకుండా తమ బానిస తత్వాన్ని బయటపెట్టుకున్నారు. సర్వస్వం కోల్పోయి, ఉజ్వల భవిత ఉన్న యువతనూ పోగొట్టుకున్న తెలంగాణ ప్రజలు మాట ఇచ్చి తప్పిన పార్టీని ప్రశ్నించకుండా ఎలా ఉంటారు. ప్రశ్నిస్తే కేసులు పెడతామనడం సరికాదు. ఇలాగే చేసుకుంటూ పోతే తెలంగాణలోని ప్రజలందరినీ జైళ్లకే తరలించాల్సి ఉంటుంది. మరి పాలకుల వద్ద అంత సామర్థ్యం ఉందా? పొద్దత్తస్థమానం పదవులను కాపాడుకునేందుకు ఢిల్లీ భజన చేసే పాలకులు తెలంగాణ నేతల ప్రకటనలపై నిప్పులు చెరగడం చూస్తేంటే వారి వెనుక ఉన్న అదృశ్య శక్తి పెట్టుబడిదారులే అనిపిస్తోంది. పెట్టుబడిదారుల ఒత్తిడితోనే తెలంగాణపై తేల్చేస్తామన్న కేంద్రం వెనక్కు తగ్గిందనే విషయం ఎవరూ మరవొద్దు. పిడికెడు మంది పెట్టుబడిదారుల కోసం నాలుగున్నరకోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ఫణంగా పెట్టిన కాంగ్రెస్ పార్టీకి నిర్దిష్టమైన విధానమంటూ లేదు. ఒక పార్టీకి ప్రతి అంశంపై ఒక విధానం ఉంటుంది. తెలంగాణపై కాంగ్రెస్‌కున్న విధానమేంటో తేలడం లేదు. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంది. యూపీఏ-1 సంకీర్ణ ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ను భాగస్వామ్యంగా చేర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలోకి టీఆర్‌ఎస్‌ను ఆహ్వానించి ఆరు కేబినెట్ బెర్త్‌లు కేటాయించింది. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. తెలంగాణపై తేల్చేందుకంటూ ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటు చేసింది. తర్వాత ‘కుక్కతోక వంకరే’ అన్న చందంగా మళ్లీ పాత బుద్ధిని ప్రదర్శించింది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తామంటూ ప్రకటించింది. కానీ ఆ ప్రకటననూ ఎక్కడా అమలు చేయలేదు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలోనూ తెలంగాణ అంశాన్ని చేర్చింది. పోలీసు నియామకాల్లో హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో నిరసన తెలిపారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని ఆరో జోన్‌లో భాగమేనని ఉద్యమించారు. తదనంతర పరిణామాలతో ఉద్యమం మరింత ఉధృతమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదే ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. సీమాంధ్రుల డబ్బు సంచులు, ఆ ప్రాంతంలో కాసులు గుమ్మరించి చేయించిన కృత్రిమ ఉద్యమాన్ని సాకుగా చూపి ఇచ్చిన ప్రకటన నుంచి వెనక్కి మళ్లింది. తర్వాత తెలంగాణలోని సకల జనులంతా ఉద్యమించినా అణచివేయడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంది. ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌లో ఓటింగ్ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఎంపీల మద్దతు అవసరమై అప్పటికే వారు డిమాండ్ చేస్తున్న ఆల్‌పార్టీ మీటింగ్‌కు అంగీకరించింది. ఆ సమావేశం తర్వాత హోం మంత్రి షిండే నెలరోజుల్లోనే సమస్య పరిష్కరిస్తామంటూ ప్రకటించినా ఆ మాటనూ నెలబెట్టుకోలేదు. ఈనేపథ్యంలో తెలంగాణవాదులు గుండె మండి చీమూ నెత్తురు, వెన్నుముఖ లేని పాలకులపై విమర్శలు చేస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు బెదిరింపులు కొత్తకాదు. ఎంతగా అణచాలని చూస్తే ఉద్యమం అంతగా ఉధృతమవుతుంది.