మోడీ సర్కారుపై పోరు.. దక్షిణాది రాష్ట్రాలకు రేవంత్ పిలుపు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల హక్కుల రక్షణకు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో తప్పనిసరైతే తాను చొరవ తీసుకుంటానని రేవంత్ పేర్కొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఓ పత్రిక నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారా? అని రేవంత్ ప్రశ్నించారు. భారత ప్రభుత్వ విధానాల ఆధారంగానే దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించడం జరిగిందన్నారు. దీని వల్ల జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే మనకు (దక్షిణాది రాష్ట్రాలకు) అదనంగా నియోజకవర్గాలు రాకపోగా, కొన్నింటిని కోల్పోతామని చెప్పారు. అందుకే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలను పెంచాలని తాను ప్రధాన మంత్రి మోదీకి సూచించినట్లు తెలిపారు.

జనాభా దామాషా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేపడితే .. బీమారు (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాల్లోని సీట్లతోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ వారు ప్రతి దానిని వాళ్ల నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాల అధికారాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ఇది కేంద్ర జాబితా..ఇది రాష్ట్ర జాబితా..ఇది ఉమ్మడి జాబితా అని నిర్ణయించినా మోదీ మాత్రం అంతా కేంద్రం చేతిలో ఉండాలనుకుంటున్నారని, మేధావులు దీనిపై ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.