యథాతథంగా స్థానిక సంస్థల ఎన్నికలు

` నేటినుంచి నామినేషన్ల జాతర
` ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు స్వీకరణ
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నేడు ఉదయం 10.30 గంటల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో నేటి ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. అయితే, పిటిషనర్‌ విజ్ఞప్తిని హైకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు.. ఆ తర్వాత సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదు దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ ఈనెల 9న ప్రారంభమై నవంబరు 11న ముగుస్తుంది. రెండు విడతల్లో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 9న (గురువారం).. మూడు విడతల్లో జరిగే సర్పంచి, వార్డు స్థానాల ఎన్నికలకు 17న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని ప్రకటించిన విషయం తెలిసిందే.
అక్కడ ఎన్నికల్లేవు
వివిధ కారణాలతో న్యాయస్థానాలు స్టే విధించిన కారణంగా 14 ఎంపీటీసీ, 27 సర్పంచి, 246 వార్డు స్థానాలకు ఎన్నికలను నిలిపివేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీ, 25 సర్పంచి, 230 వార్డులుండగా.. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలంలోని రెండు సర్పంచి, 16 వార్డు స్థానాలకూ ఎన్నికలు నిర్వహించడం లేదని పేర్కొంది.