యాభై యూనిట్లు వాడే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌

సబ్‌ప్లాన్‌ చట్టాన్ని విపక్షాలే అడ్డుకున్నాయి  ఉగాది నుంచి అమ్మహస్తం
సీఎం కిరణ్‌ వరాల జల్లు
ఏలూరు, ఏప్రిల్‌ 5 : రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు మేలు చేకూర్చే ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని విపక్షాలన్నీ అడ్డుకున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. భారత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రాం 106వ జయంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎస్‌సి ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో దళిత కుటుంబాలతో ఆయన ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. తొలుత జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం కిరణ్‌ ఆ తర్వాత దళిత వర్గాలకు చెందిన నాయకులతో వారి మనోగతాన్ని, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంపై దళితవర్గాల ప్రజలందరూ ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మద్దతుదారులు ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ చట్టం అమలు చేసిన ఘనత మీదేనంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఆపై మాట్లాడిన సిఎం ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ చట్టం సమాజంలో వెనుకబడిన దళితులు, గిరిజనుల ఆర్థిక సామాజిక భద్రతకు ఒక అస్త్రంగా అభివర్ణించారు. సోనియాగాంధీ సారధ్యంలో దేశంలో, రాష్ట్రంలో అమలు చేయని విధంగా మన రాష్ట్రంలోనే ఈ చట్టాన్ని తేవడానికి కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో పనిచేసిందని చెప్పుకొచ్చారు. చట్టాన్ని అసెంబ్లీలోకి తేవడానికి ప్రయత్నించినప్పుడు తెలుగుదేశం, వామపక్షాలతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూడా అడ్డుపడ్డాయని మండిపడ్డారు. విపక్షాలన్నీ ఏకమైనప్పటికీ దళితులు, గిరిజనులకు మేలు చేయడం కోసమే ఈ చట్టాన్ని సమర్ధవంతంగా తెచ్చామని, ఇది ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమైందంటూ తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఈ ఏడాది ఈ చట్టం కింద 12వేల 600 కోట్ల రూపాయల నిధులను ఎస్‌సి, ఎస్‌టిలకు దక్కేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు చెందాల్సిన నిధులు పక్కదారి పట్టకుండా.. వీలైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి చట్టం ఎస్‌సి, ఎస్‌టిలకు ఒక వరం అని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టిల సమగ్రాభివృద్ధికే దోహదం చేసే చట్టాన్ని అడ్డుకున్న విపక్షాలకు వారే గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీ వల్లే సాధ్యమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శకం ముగిసిందని విరుచుకుపడ్డారు. వరదలు సంభవించినప్పుడు రాష్ట్రాన్ని విస్మరించి ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబునాయుడు పక్క రాష్ట్రమైన ఒడిషాలో తుపాను నిర్వాసితులను ఆదుకోడానికి కృషి చేశామని పదే పదే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, ఇక ఆయన ఒడిషాలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారేమోనని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలం అంతకంతకు పెరుగు తోందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఇన్‌ఛార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మంత్రులు బాలరాజు, వట్టి వసంత కుమార్‌, ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, నాగేశ్వరరావు, ఈలి నాని, డిసిసిబి చైర్మన్‌ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. కాగా ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం కోసం నిర్వహించిన ఈ సదస్సులో ఆహ్వానం అందని దళిత, గిరిజన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు రాజేష్‌కుమార్‌, వనిత, బాలరాజు గైర్హాజరయ్యారు. సిఎం నిర్వహించిన ఈ సమావేశానికి ఆయా వర్గాల ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించకుండా కేవలం కాంగ్రెస్‌ పార్టీకి క్రెడిట్‌ తెచ్చేందుకు ఆ పార్టీకి చెందిన చోటా మోటా నేతలను ఆహ్వానించారనే విమర్శలు కూడా తారాస్థాయిలో విన్పించాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టిలను కాంగ్రెస్‌ పార్టీవైపు తిప్పు కోవడానికే సిఎం ఈ కార్యక్రమం నిర్వహించారన్న విమర్శలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.