యువతకు పెద్దపేట వేసేలా టిడిపి యత్నాలు

వారసులను రంగంలోకి దింపేందుకు నేతల వ్యూహాలు

రానున్న ఎన్నికల్లో మారనున్న పరిస్థితులు

అమరావతి,జూలై13(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు నిశ్చయించిన వేళ, టిడిపిలో కొందరు నేతలు తమ వారసులకు అవకాశాలు కల్పించేందుకు పావులు కదుపుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో యువతను ఆహ్వానించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ వారసలును రంగంలోకి దింపాలని ప్రస్తు నేతలు కొందరు తహతహలాడుతున్నారు. లోకేశ్‌ తరహాలనే కొందరు నేతలు పార్టీల చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ ముందున్నారు. ఇప్పటికే అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలతో దూసుకుని పోతున్నారు. పరిటాల వారసుడిగా ఆయన అనంతలో కలియదిరుగుతున్నారు. ఉత్తరాంధ్రలో ఎర్రం నాయుడు మరణంతో ఎంపిగా గెలిచిన రామ్మోహన్‌ నాయుడు తన వాక్చాతుర్యంతో మంచి నేతగా ఎదిగారు. ఓ రకంగా ఆయన పార్లమెంటులో తనకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రతిభను నిరూపించుకున్నారు. తల్లిదండ్రుల మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన భూమా అఖిలప్రియ కూడా మంచి నేతగానే రాణిస్తున్నారు. ఇకపోతే విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు వారి తనయుల రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు. అవసరమైతే తనయుల కోసం తమ పదవులను త్యాగాలకు కూడా సిద్ధపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతూ ఇప్పటికీ ఆరుసార్లు ఎంఎల్‌ఏగా, ఐదుసార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర సీనియర్‌ మంత్రి

చింతకాయల అయ్యన్నపాత్రుడు పెద్ద కుమారుడు విజయ్‌ గడిచిన ఐదారు సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. అనకాపల్లి ఎంపీ లేదా నర్సీపట్నం ఎంఎల్‌ఎగా పోటీ చేయాలన్న ఆకాంక్షతో అయ్యన్న తనయుడు విజయ్‌ తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అతను పుణెలో ఉన్న పొటిటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ కూడా పొందారు. మంచి రాజకీయ నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు.

మంత్రి లోకేష్‌తో వున్న పరిచయాలతో పాటు 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి తరపున ప్రచార బాధ్యతలు చేపట్టిన అనుభవంతో రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో మిస్‌ అయినా ఈసారి ఏ విధంగానైనా టిక్కెట్టు తెచ్చుకోవాలన్న పట్టుదలతో విజయ్‌ ఉన్నారు.తన తనయుడిగా కాకుండా వ్యక్తిగత ఇమేజ్‌తో విజయ్‌ పార్టీ టిక్కెట్టు తెచ్చుకుంటే తనకు అభ్యంతరం లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు చెబుతున్నారు. తండ్రి ఓకే అంటున్నా, టీడీపీ అధినేత నిర్ణయం బట్టే అయ్యన్న తనయుడి రాజకీయ భవిష్యత్తు అధారపడి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి నేతలను ప్రోత్సహించి యువతరానిక ఇపట్టం కడతారా లేదా అన్నది చూడాలి. అదే రీతిలో జిల్లాకు చెందిన మరొక రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తన తనయుడు రవితేజ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతవరకూ ప్రత్యక్ష రాజకీయాల్లో గంటా తనయుడు పాల్గొనక పోయినప్పటికీ తండ్రి రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తండ్రి వ్యాపార కార్యకలాపాలు కొంతమేర చూసుకునే రవితేజ అన్ని కలిసొస్తే ప్రస్తుతం తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి లేదా గతంలో ప్రాతినిథ్యం వహించిన చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు పరచారం సాగుతోంది. సినీ రంగంలోనూ అనుభవం ఉన్న రవితేజ రాజకీయాల్లోకి రావాలని ఉవ్వీళ్లూరుతున్నారు. ఒక మంత్రికి తనయుడు కావడమే కాకుండా, మరో మంత్రి

నారాయణకు అల్లుడు కూడా కావడంతో రవితేజ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని భావిస్తున్నారు. రవితేజకు రాజకీయ, నాయకత్వ లక్షణాలపై తగిన అవగాహన కల్పించేందుకు హైదరాబాదులో గల ఒక ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థలో కొద్ది రోజుల పాటు మంత్రి గంటా శిక్షణ కూడా ఇప్పించినట్టు సమాచారం. యువతను పెద్ద ఎత్తున రాజకీయాల్లో తీసుకుని వస్తామని, అవకాశాలు కల్పిస్తామని సిఎం చంద్రబాబు పదేపదే చెబుతున్న నేపథ్యంలో కొందరికైనా అవకాశం ఇచ్చేలా పరిస్థితులు ఉన్నాయి. వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాబోతున్న వేళ, జనసేన, వైకాపా, బిజెపిలను తట్టుకునేలా యూత్‌ను రంగంలోకి దఇంపేందుకు చంద్రబాబు ప్లాన్‌ వేస్తున్నారని సమచారం. అదే నిజమైతే ఎక్కువమందికి అవకాశాలు రావచ్చు.