యువత శక్తి, యుక్తులు వెలికి
– నైపుణ్యానికి సాన
– ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనకు ప్రధాని మోదీ ప్రారంభం
న్యూఢిల్లీ,జులై15(జనంసాక్షి): నైపుణ్యంలో యువతకు శిక్షణ అత్యంత అవసరమని యువత శక్తి యుక్తులు వెలికితీసి, వారి నైపుణ్యానికి సాన పడతామని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నైపుణ్యాభివృద్ధితో జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయన్నారు. ఎవరైనా జేబులో డబ్బులు దొంగిలించగలరు గానీ.. నైపుణ్యాన్ని దోచుకోలేరన్నారు. ఈ దేశంలో ఉన్న యువతకు నైపుణ్యం ఉందని దీనిని సన్మార్గంలో తీసుకుని వెళ్లాలన్నదే తమ ప్రయత్నమని అన్నారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’ కార్యక్రమాన్ని బుధవారం మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. యువత కోసం మహత్తర కార్యక్రమం తీసుకురావాల్సిన అవసరం గుర్తించే ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’ను ప్రారంభించినట్లు చెప్పారు. అందుకే యువత కోసం ‘కౌశల్ వికాస్ యోజన’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మనలో నైపుణ్యం లేకపోతే మన అవసరం ఎవరికీ ఉండదన్నారు. నైపుణ్య భారత్ కేవలం ఉద్యోగానికి మాత్రమే కాదని.. ఆత్మాభిమానానికి సంబంధించినది వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఈ మిషన్ ద్వారా ప్రజలు కంటున్న కలలను సాకారం చేసి తీరుతామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచమంతా భారత్ వైపే చూసిందని… అది భారతీయులందరికీ గర్వకారణమని మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంతో మన సత్తా చాటామని గుర్తు చేశారు. పేదరికంపై ప్రణాళిక బద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కౌశల్ వికాస్ యోజన పథకం యువతకు ఎంతో అవసరమన్నారు. నైపుణ్యం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ఐటీఐల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.
దేశ యువతను నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన కార్యక్రమమే.. ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’. దీని ద్వారా యువతను వేర్వేరు రంగాల్లో నిపుణులుగా
తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. యువతకు నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక, వృత్తివిద్య అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ప్రదాని పేర్కొన్నారు. నైపుణ్యం పొందిన యువతకు నైపుణ్యాల పత్రాలు అందజేసి.. వారికి రుణాలు సులువుగా అందేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. వచ్చే సంవత్సరానికి 24 లక్షల మందికి, 2022 నాటికి 40 కోట్ల 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని వివరించారు.
నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు
నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ అన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. 12 ఏళ్ల చదువుతో మాత్రమే ఉద్యోగాలు రావని.. నైపుణ్యంలో 12 వారాల శిక్షణతో ఉపాధి దొరుకుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ద్వారా పరిశ్రమల్లో యువతకు గొప్ప అవకాశాలు వస్తాయన్నారు. అంతేగాకుండా వారి దశ కూడా మారుతందని అన్నారు.