యూపీఏతో దేశం అధోగతి ఎన్‌డీఏతోనే తెలంగాణ : నితిన్‌ గడ్కారీ

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌18(జనంసాక్షి): యూపీఏ విధానాల వల్లే దేశం అధోగతి పాలయిందని, అందుకే కాంగ్రెస్‌ పాలనను ఇక గద్దె దింపే సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ అధ్యక్షులు గడ్కరీ అన్నారు. గురువారం నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడారు. 1947 నుంచి ఇప్పటివరకు సుమారు 60 సంవత్సరాలు పరిపాలన చేసినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కుంభకోణాలకు
కేంద్రబిందువుగా మారిందని అన్నారు. రోజుకో కుంభకోణం, పూటకో అవినీతితో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తోందని చెప్పారు. పేద, పీడిత, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ కొనసాగుతుందని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను నిలువునా దోచుకుంటోందని చెప్పారు. ఎన్డీయే వల్లే తెలంగాణ సాధ్యమన్నారు..తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులు ప్రవహిస్తున్నా వాటి నీరును ఉపయోగించుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆరోపించారు. నర్మద నది నీటితో రాజస్థాన్‌ రాష్ట్రం ఎంతో లబ్ది పొందిందని కానీ ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఉపయోగించుకోలేకపోవడం విచారకరమన్నారు. విత్తనాల కల్తీ, ఎరువులు సకాలంలో అందక, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నిలువునా మునిగితే వారికి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించకపోవడం విడ్డూరమన్నారు. ఇందిరాగాంధీ నుంచి రాహుల్‌ గాంధీవరకు గరీభీ హటావో అనే నినాదంతో గెలిచి ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అధికారంలోకి రాగానే యూపీఏ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటేల చేశారన్నారు. అభివృద్ధిలో ఆఖరు అవినీతిలో ప్రథమ స్థానంలో యూపీఏ ప్రభుత్వం నిలిచిందని దుయ్యబట్టారు. 2జీస్ప్రెక్ట్రమ్‌, కామన్‌వెల్త్‌ క్రీడలు, ఆదర్ష్‌ కుంభకోణం, తాజాగా బొగ్గు కుంభకోణం, ప్రస్తుతం సోనియాగాంధీ అల్లుడి చేష్టలు సైతం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఉపాధిలేని ప్రాంతంగా మార్చడంతోనే నక్సలిజం ఆవిర్భవించిందని తెలిపారు. ఉపాధి లేకపోవడంతోనే చాలా మంది అడవి బాట పట్టారని అన్నారు. ఏటా వేలాది కోట్లు ప్రజాధనం ఖర్చు అవుతున్నా ప్రయోజనం లేకుండా పోతోందని చెప్పారు. రాబోయే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని అన్నారు. అభివృద్ధి జరగాలంటే నాయకత్వ మార్పిడి ఖచ్చితంగా జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, ప్రధాన కార్యదర్శి శశిభూషన్‌కాచే, నాయకులు సుజాతారెడ్డి, వనజ, వనిత తదితరులు పాల్గొన్నారు,

ఐటము నంబరు 1911