యూరియా కొరతను తక్షణం తీర్చాలి
రైతులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోరా?
ఆదిలాబాద్,సెప్టెంబర్5 (జనం సాక్షి ) : రాష్ట్రంలో యూరియా కొరతను నివారించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని,రైతుఉల రోడ్డెక్కకుండా చూడాలని సిపిఐ నేత ముడుపు ప్రభాకర్
రెడ్డి సూచించారు. రైతు సంక్షేమం అని చెప్పుకుంటున్న కెసిఆర్ యూరియా కోసం రైతులు రోడ్డెక్కితే కనీసంగా స్పందించకపోవడం దారుణమన్నారు. యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణలో రైతాంగం, వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కుంటోందన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం హావిూ ఇచ్చి అమలు చేస్తున్న రైతు బంధు, భూరికార్డుల ప్రక్షాళన లక్ష్యానికి ఆమడ దూరంలో ఉందని, దీని వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. 30 శాతం రైతులకు కూడా వీటివల్ల ప్రయోజనం దక్కలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీని అమలుచే యాలన్నారు. యూరియా కొరతతో రైతులు కలత చెందుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోక పోవడం సరికాదన్నారు. ఒక్కో మండలానికి వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు కేవలం 200 టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. పంటలకు యూరియా ఇచ్చే సమయం ఇదే కావడం అందుకు తగ్గట్లు వర్షం కురియడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. ఒకవైపు అధికారులు యూరియా కొరత లేదంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అరకొరగా వస్తున్న యూరియాను పంపిణీ చేస్తున్నారు. యూరియా కొరతను దృష్టిలో ఉంచుకొని భూమితో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు కేవలం రెండు బ్యాగుల చొప్పున ఇస్తున్నారు. ఆ రెండు బ్యాగుల కోసం రైతులు ఉదయం ఆరు గంటల నుంచే పీఏసీఎస్ వద్ద బారులు తీరుతున్నారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి బారులు తీరుతున్నారు. రైతులను కట్టడి చేసేందుకు పోలీసుల సహయం తీసుకోవాల్సి వస్తోంది. అధికారులు పంపిణీ చేసే రెండు బస్తాల యూరియా ఎటూ సరిపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.