‘రంగారెడ్డి’ బంగారు తునకైతది

గోర్గాం, నోయిడాల తరహా అభివృద్ధి
విశాలాంధ్రాలో విలీనాన్ని రంగారెడ్డి వ్యతిరేకించిండు
బానిసలుగా బతకడం కన్నా చనిపోవడమే మేలన్నడు : కేసీఆర్‌
తాతగారి ఆశయ సాధనకే టీఆర్‌ఎస్‌లో చేరా : విశ్వేశ్వర్‌రెడ్డి
రంగారెడ్డి, జూన్‌ 9 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లా బంగారు తునకైతదని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కేవీ రంగారెడ్డి ముని మనవడు విశ్వేశ్వర్‌రెడ్డి ఏర్పాటు చేసిన రంగారెడ్డి విగ్రహాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి, తాండూర్‌కు చెందిన రోహిత్‌రెడ్డి తమ అనుచరులతో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంద్రాలో కలిపినప్పుడే తీవ్రంగా వ్యతిరేకించిన మ¬న్నత వ్యక్తి కొండా వెంకట రంగారెడ్డి అని చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తన జీవితంలో ఆనందం కలిగినరోజు ఈరోజేనన్నారు. మ¬న్నత వ్యక్తి అయిన రంగారెడ్డి విగ్రహాన్ని తాను ఆవిష్కరించడంతో ధన్యమైందన్నారు. తెలంగాణక చెందిన హైదరాబాద్‌ నడిబొడ్డున హవులా పోశిగాళ్ల విగ్రహాలు పెట్టిన సీమాంధ్రులు తెలంగాణకు చెందిన మ¬న్నత వ్యక్తులను మరిచిపోయారన్నారు. వారి పైత్యాన్ని తెలంగాణ వారిపై రుద్దేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు. జాగీర్‌దార్ల చట్టాన్ని రద్దుచేసి రైతులకు ఎంతో మేలు చేసిన గొప్ప వ్యక్తి కొండా వెంకటరెడ్డేనన్నారు. ఆనాడు తెలంగాణకోసం రంగారెడ్డి ఎంతో మధనపడ్డారని కేసిఆర్‌ పేర్కొన్నారు. కెవి రంగారెడ్డి వారసుడిగా చట్టసభల్లో విశ్వేశ్వర్‌రెడ్డి అడుగు పెట్టి కెవి రంగారెడ్డి ఆశయ సాధన అయిన తెలంగాణ రాష్ట్రసాధనకోసం ప్రదానమంత్రిని తన వాయిస్‌తో నిలదీస్తారన్నారు. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలోని భూములను ఇరవై కోట్ల రూపాయలు ధర పలికేలా చర్యలు తీసుకుంటామన్నారు. చేవెల్ల చెల్లెమ్మ అంటూ వైఎస్‌ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు. ఎక్కడో 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకువస్తామని నమ్మించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. కేవలం 55 కిలోమీటర్ల దూరంలోని జూరాల ప్రాజెక్టునుంచి కృష్ణా జిల్లా నీటిని తీసుకువచ్చి అభివృద్దిచేసి తీరుతామన్నారు. కుందుర్గులో 100 టీఎంసీలతో భారీ ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. కేవలం కాంట్రాక్టర్లకు జేబులు నింపేందుకే ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టును ముందుకు తెచ్చారని ఆరోపించారు. తెలంగాణా బ్రతుకులు బాగుపడాలంటే ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. తెలంగాణకోసం టీఆర్‌ఎస్‌ ఎన్నో ఉద్యమాలు చేసిందని 1969లోనే 400మంది తెలంగాణకు చెందిన యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. నేడు కూడా వెయ్యిమందికిపైగా చనిపోయినా కేంద్రానికి, సీమాంధ్ర పార్టీలకు గుణపాఠం రావడం లేదన్నారు. కెవి రంగారెడ్డి పుట్టిన పుణ్యభూమిలో పుట్టిన యాదిరెడ్డి పార్లమెంట్‌ ఆవరణలో తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకుని యూపీఏకు కళ్లు తెరిపించే పనిచేసినా కూడా కాంగ్రెస్‌లో కదలిక రాలేదన్నారు. తెలంగాణకోసం టీఅర్‌ఎస్‌ 13 ఏళ్లనుంచి పోరాటాలు చేస్తున్నా కూడా సీమాంధ్రులు నీళ్లు పోస్తూనే ఉన్నారని ఆరోపించారు. 2009 డిసెంబర్‌ 9న వచ్చిన తెలంగాణాను అడ్డుకున్నది చంద్రబాబు కాదా అన్నారు. ఇలా టీడీపీ మోసం చేస్తే వైఎస్సార్‌సిపి నాయకుడు జగన్‌ పార్లమెంట్‌లో ప్లకార్డు పట్టుకుని తెలంగాణకు వ్యతిరేకిస్తూ తిరిగాడన్నారు. టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలేమైనా గాందర్వులా, కిన్నెరులా వారి నైజం తెలువకపోవడానికి అని కేసిఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణాలో వ్యతిరేకమైన సీమాంద్ర పార్టీల పెత్తనం అవసరమా అని చర్చించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సంక్రాంతి పండుగ సమయంలో గంగిరెద్దుల వాళ్లలాగా టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌లు వస్తున్నాయన్నారు. త్వరలోనే ఎన్నికలు రానున్నందున మరోసారి తెలంగాణా ప్రజలకు కుక్కకు బొక్కవేసినట్లుగా డబ్బులు, లిక్కర్‌ సీసాలు పంచేందుకు ప్రయత్నాలుచేస్తున్నాయని ఆరోపించారు. బానిసగా ఉండేకంటే పోరాడి చచ్చిపోయినా ఫర్వాలేదని ఆనాడే రంగారెడ్డి చెప్పిన మాటలను ముందుకు తీసుకెల్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈరెండుపార్టీల తీరిలా ఉంటే జాతీయ పార్టీగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసిన పార్టీ అనిఆరోపించారు. 52ఏళ్ల లో కేవలం 3న్నర ఏళ్లు మాత్రమే తెలంగాణకు చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రులయ్యారంటే తెలంగాణపై కాంగ్రెస్‌కు ఇతరపార్టీలకు చిత్తశుద్ధిలేదన్నారు. ఉద్యమం జరుగుతుంటే కూడా సీఎంగా, పీసీసీ అధ్యక్షుడిగా, స్పీకర్‌గా, శాసనమండలి చైర్మన్‌గా కూడా సీమాంధ్రులనే నియమించి అఖిలభారత కాంగ్రెస్‌ నాయకత్వం తెలంగాణ వారిని బానిసలుగా చేస్తూనే ఉన్నారన్నారు. చెన్నారెడ్డి కూడా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెల్తే కాంగ్రెస్‌ ఆత్మవంచనకు గురిచేసి నానా హింసలు పెట్టి చిట్టచివరికి ఆయనను ముప్పుతిప్పలు పెట్టిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మెజార్టీ స్థానాలు సాధించేలా ప్రయత్నించాలని కేసిఆర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, పార్టీనేతలు, కేకేశవరావు తదితరులు పాల్గొన్నారు.
తన తాత, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కెవి రంగారెడ్డి ఆశయ సాధనకోసం తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన మనవడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తమ తాతయ్య ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిక్కర్లు వేసుకుని తిరిగేవారమని, ఆనాడు పాఠశాలలకు నిత్యం సెలవులు వచ్చినప్పుడు ఆడుకోవడానికి వెళ్తే తెలంగాణకోసం పోరాటానికి పోయావురా అనేవాడని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం రంగారెడ్డి నిత్యం పరితపించేవాడన్నారు. తెలంగాణ రావాలంటే కేవలం టిఆర్‌ఎస్‌తోనే వస్తుందనే నమ్మకంతో పార్టీలో చేరుతున్నానన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఇంకేదో సాధించాలనే తపనఏది లేదన్నారు. కేవలం తాత రంగారెడ్డి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెల్లేందుకే వస్తున్నానన్నారు. తనకు పదవులపై ఎలాంటి ఇష్టం లేదన్నారు. తెలంగాణా రాష్టాన్న్రి ఆంద్రాలో కలపే సమయంలోనే ఎదిరించిన మహానేత అయిన రంగారెడ్డిని నిత్యం స్మంరిచుకునేలా చేయాలన్నదే తన ఏకైక లక్ష్యమన్నారు. కేసిఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణా సాధించి తన తాత ఆశయాలను పూర్తిచేస్తానని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.