రంజాన్ దీక్షలు ప్రారంభం
కరీంనగర్, జూలై 21 (జనంసాక్షి) : నెల రోజుల పాటు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ కఠోర ఉపవాస దీక్షతో అల్లాను ఆరాధించే పవిత్ర రంజాన్ నెల శనివారం ప్రారంభమైంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ నెలలో విరివిగా దాన ధర్మాలు చేస్తారు. అంతేకాకుండా ఈ మాసంలో పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఆవిర్భవించింది. మానవ జీవన వ్యవస్థను నడిపే సంవిధానాన్ని మార్గదర్శక సూత్రాలను ఖురాన్ రూపంలో మానవాళికి మహ్మద్ ప్రవక్త ద్వారా పంపబడ్డాయి. దీంతో ఆధ్యాత్మిక వికాసానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుంది. ఈ మాసంలో రంజాన్ విశిష్టతలో భాగంగా 21వ రోజున మహ్మద్ ప్రవక్తకు పదవి లభించింది. వెయ్యి రాత్రుల కంటే లైలతుల్ ఖద్ర్ పుణ్య రాత్రి ఈ నెలలోనే ఉంటుంది. 27వ ఉపవాస దీక్షా రాత్రినే పుణ్య రాత్రిగా పరిగణిస్తారు. జిల్లాలో మసీదులు రంజాన్ నెల కోసం ముస్తాబు అయ్యాయి. విద్యుత్ దీపాలతో మసీదులను అందంగా అలంకరించారు. ముస్లింలు ఉపవాస దీక్షలకు సంబంధించిన సామాగ్రిని కొనుగోలు చేస్తుండడంతో మార్కెట్లో సందడి నెలకొంది. ఇఫ్తార్ కోసం ప్రత్యేక హోటళ్లు వెలసాయి. ఇందులో హరీస్, హలీం ఇతర ప్రత్యేక వంటకాలు తయారు చేస్తున్నాయి. వీటికోసం గత పది రోజుల నుండి సన్నాహకాలు చేసుకున్న హోటళ్లు శనివారం నుండి తయారీని ప్రారంభించాయి. ఈ వంటకాలు రోడ్లపై వెళ్తున్న వారికి కూడా నోరూరిస్తూ వారిని హోటళ్ల వైపు వెళ్లేలా చేస్తున్నాయి.