రండి బాబూ రండి… ఛార్జర్స్ వేలానికి టెండర్లు ఆహ్వానించిన డెక్కన్
హైదరాబాద్,సెప్టెంబర్ 6:ఎట్టకేలకు ఐపీఎల్ హైదరాబాద్ ఫ్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్ అధికారికంగా వేలానికి సిధ్దమైంది. తమ ఫ్రాంచైజీని కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారి నుండి డెక్కన్ క్రానికల్ ¬ల్టింగ్స్ టెండర్లను ఆహ్వానించింది. డెక్కన్ క్రానికల్ వార్తపత్రికలో దీనికి సంబంధించిన ప్రకటనను ప్రచురించారు. సెప్టెంబర్ 13లోగా వచ్చిన బిడ్లలో ఎక్కువమొత్తం కోడ్ చేసినవారికి ఫ్రాంచైజీ దక్కుతుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారమే బిడ్డింగ్ జరుగుతుందని ప్రకటనలో డిసీ స్పష్టం చేసింది. బిడ్డింగ్‌లో ఫ్రాంచైజీని దక్కించుకున్న సంస్థ హైదరాబాద్ వేదికగా ఐపీఎల్‌లో పాల్గొనవచ్చని తెలిపింది. గతంలో లాగానే ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చని , ఈ మేరకు బోర్డుతో ఒప్పందం చేసుకోవాలని సూచించింది. అయితే తుది నిర్ణయం బీసిసిఐదేనని స్పష్టం చేసింది. 2008లో డెక్కన్ క్రానికల్ సంస్థ 107 మిలియన్లతో ఛార్జర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ , బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తర్వాత అత్యధిక మొత్తానికి అమ్ముడైన టీమ్ ఇదే. ప్రస్తుతం టెండర్ విధానాన్ని చూస్తే… ముంబైలోని బీసీసీఐ కార్యాలయం నుండి అప్లికేషన్ తీసుకుని , 5 లక్షలతో డెక్కన్ క్రానికల్ ¬ల్డింగ్స్ లిమిటెడ్ పేరుతో డిడి తీయాలని కోరింది. నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీ కోసం వచ్చే బిడ్డింగ్ మొత్తంలో 5 శాతం బోర్డుకు చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ వేసేందుకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 13 మధ్యాహ్నం 12 గంటలు. అదే రోజు బిడ్డింగ్‌లో గెలిచిన సంస్థ పేరును ప్రకటించనున్నారు. అయితే కొత్తగా ఫ్రాంచైజీని కొనుక్కునే సంస్థ ఐదో సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ళకు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొత్త సంస్థ జట్టు పేరును డెక్కన్ ఛార్జర్స్‌గానే వ్యవహరించుకోవచ్చని డిసీ తమ ప్రకటనలో తెలిపింది. 2010లో ఛాంపియన్‌గా నిలిచిన డెక్కన్ ఛార్జర్స్ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అటు ఆర్థికపరంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అదే సమయంలో తమ కష్టాల నుండి గట్టెక్కేందుకు ఛార్జర్స్ టీమ్‌ను బ్యాంకులో తాకట్టు పెట్టి 400 కోట్లకు పైగా రుణాలు తెచ్చుకోవడంతో బీసీసీఐ జోక్యం చేసుకుంది. బోర్డు నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీలను తనఖా పెట్టకూడదు. ఈ నేపథ్యంలో డెక్కన్ క్రానికల్ చివరకు జట్టును నడపలేమని చేతులెత్తేయడంతో బోర్డు రెండు రోజల క్రితం సమావేశమై చర్చించింది. తుది
నిర్ణయాన్ని మాత్రం సెప్టెంబర్ 15 వరకూ వాయిదా వేసింది. ఈ లోపు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని డిసిని కోరింది.