రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందింది

హిందూ మహాసముద్ర తీరంలో అప్రమత్తత అవసరం
ప్రధాని మన్మోహన్‌సింగ్‌
గుర్గావ్‌, మే 23 (జనంసాక్షి) :
భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యం ద్విగుణీకృతమైందని, భద్రతను అత్యంత పటిష్టం చేసుకుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. భారత రక్షణ సహకార వ్యవస్థ అభివృద్ధి చెందిందని, అత్యాధునిక టెక్నాలజీ, సామర్థ్యం మెరుగుపడిందని చెప్పారు. గురువారం గుర్గావ్‌లోని ఏర్పాటు చేసిన ఇండియన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీకి ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ మహాసముద్రంలో సుస్థిరత నెలకొల్పడం తమ ప్రధాన బాధ్యత అని, అందుకోసం అవసరమైన అన్ని శక్తియుక్తులను సమకూర్చుకున్నామని తెలిపారు. గత తొమ్మిదేళ్లుగా ఎన్నో రక్షణపరమైన సవాళ్లను అధిగమించి, సామర్థ్యాన్ని పెంచుకున్నామన్నారు. సవాళ్లను అవకాశంగా తీసుకొని అవసరమైన రక్షణ చర్యలను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. సమీకృత సవాళ్లను ఎదుర్కొనేందుకు, సైబర్‌ నేరాలను నియంత్రించేందకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పొరుగుదేశాల నుంచి ఎదురవుతున్న వ్యవస్థీకృత సవాళ్లను ఎదుర్కోవడం కష్టంగా మారిందన్నారు. అంతర్గత సంక్షోభాలు, ఉగ్రవాద దాడులు కూడా సవాలు విసురుతున్నాయని పేర్కొన్నారు.