రచ్చ రచ్చగా మారిన మక్తల్ మండల సర్వసభ్య సమావేశం

-ఎమ్మెల్యే ఎంపిటిసిల మధ్య వాగ్వాదం
– ఎంపీటీసీలు సర్పంచ్ ల మధ్య తోపులాట
-సమావేశాన్ని బహిష్కరించిన భాజపా ఎంపిటిసిలు, సర్పంచులు
-ఎంపిపి కార్యాలయం ముందు ధర్నా

మక్తల్, జులై 21 (జనంసాక్షి)

మక్తల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చగా మారింది. చివరకు ఎంపీటీసీలు సర్పంచ్ ల మధ్య తోపులాటలు, బహిష్కరణ, ధర్నా వరకు దారితీసింది. గురువారం ఎంపీపీ అధ్యక్షురాలు పసుపుల వనజదత్తు అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ,డిసిసిబి చైర్మన్ చిట్యాల నిజాం పాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన చర్చ సందర్భంగా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీజరిన్లు గత మూడు నెలలుగా ఎందుకు జరగడం లేదంటూ భాజపాకు చెందిన కాచ్ వార్ ఎంపిటిసి సభ్యులు జి. బలరాం రెడ్డి ప్రశ్నించారు. అందుకు ఎమ్మెల్యే కల్పించుకుని ఆసుపత్రి సమస్య మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందని ఇక్కడ ఆ అంశాన్ని ప్రస్తావించవద్దని అన్నారు. దీంతో ఆసుపత్రి మున్సిపాలిటీ పరిధిలో ఉండవచ్చు కానీ మండల ప్రజలకు సంబంధించిన ఆసుపత్రి అని మూడు నెలలుగా సిజరిన్ కాన్పులు జరగడం లేదు ఎందుకని ఎంపిటిసి బలరాం రెడ్డి ప్రశ్నించారు. ఈ సమయంలో కల్పించుకోబోయిన ఎమ్మెల్యేను సమాధానం సంబందిత అధికారి చెప్పాలి నువ్వెందుకు చెబుతున్నావు అంటూ సంబోధించడంతో ఎమ్మెల్యే మర్యాద లేకుండా ఏక వచనంతో సంభవిస్తావా అంటూ ఎంపీటీసీ బలరామిరెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే ఎంపీటీసీల మధ్య పలు విషయాలపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పంచాయతీరాజ్ శాఖ పై జరిగిన చర్చలో సంబంధిత ఏఈ లక్ష్మీనారాయణ తన ప్రగతి నివేదికను చదివి వినిపిస్తుండగా భాజపా కు చెందిన చిట్యాల ఎంపిటిసి సభ్యులు రామలింగప్ప కల్పించుకొని చిట్యాలకు మంజూరైన సీసీ రోడ్డును ఎవరు రద్దు చేయించారని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కల్పించుకొని నిబంధనలకు విరుద్ధంగా మంజూరైన సీసీ రోడ్డును తానే రద్దు చేయించానని అన్నారు. పంచాయతీరాజ్ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఎమ్మెల్యేగా తన దృష్టికి తీసుకు రాకుండా సిసి రోడ్డు మంజూరు చేయడం పద్ధతులకు విరుద్ధంగా జరిగిందని అందుకే తానే సిసి రోడ్డును రద్దు చేయించినట్లు వెల్లడించారు. మా గ్రామానికి మంజూరైన రోడ్డును నువ్వు ఎందుకు రద్దు చేయిస్తావ్ అంటూ ఎంపీటీసీ రామలింగప్ప ఎమ్మెల్యే తో వాగ్వివాదానికి దిగారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి ఏనాడు చిట్యాల గ్రామాన్ని సందర్శించని నీవు అభివృద్ధిని అడ్డుకుంటున్నామంటూ ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తెరాస ఎంపిటిసి ఆశ రెడ్డి సర్పంచులు ప్రతాపరెడ్డి పెద్ద వెంకటప్ప తదితరులు భాజపా ఎంపీటీసీలతో తీవ్ర వావిధానికి దిగారు. ఇదే సమయంలో ముసలాయపల్లి సర్పంచ్ పెద్ద వెంకటప్ప చిట్యాల ఎంపీటీసీ రంగప్ప ను తోసి వేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చేస్తుంది. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ సమయంలో సిఐ సీతయ్య ,ఎస్ ఐ పర్వతాలు సమావేశంలోకి వచ్చి తోపులాట నుండి ఇరు వర్గాలను పక్కకు నెట్టారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి చిట్యాల ఎంపీటీసీ ని సమావేశం నుండి బయటకు వెళ్లాలని ఆదేశించారు. అభివృద్ధి పనులను అడ్డుకోవడమే మీ విధానమైతే ఈ సమావేశంలో తామెందుకు ఉండాలంటూ భాజపాకు చెందిన ఎంపీటీసీలు సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లారు. కార్యాలయం ముందు బైఠాయించి ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నిదానాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భాజపా సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నచోట ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ మంజూరు చేసిన సిసి రోడ్డును ఎమ్మెల్యే రద్దు చేయించడం దుర్మార్గమని అన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే వైఖరి ఇకనైనా మార్చుకోవాలని అన్నారు.