రమ్య కుటుంబానికి పరామర్శ
టిడిపి నేతలను అరెస్ట్ చేసి తరలింపు
పోలీసుల తీరుపై మండిపడ్డ లోకేశ్
గుంటూరు,అగస్టు16(జనంసాక్షి): హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వచ్చిన సందర్భంగా గుంటూరులోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్దికోసమే లోకేశ్ వచ్చారంటూ వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకుని ఆరోపించాయి. ఈ క్రమంలో తెదేపా`వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోటాపోటీ నినాదాలతో శ్రేణులు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేపట్టారు. అనంతరం లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగతా నేతలను వివిధ ప్రాంతాల్లోని స్టేషన్లకు తీసుకెళ్లారు.
ఉన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబసభ్యుల పరామర్శ సందర్భంగా గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నారా లోకేష్ సహా టీడీపీ నేతలను అరెస్టు చేశారు. లోకేష్‌ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ధూలిపాళ నరేంద్ర, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్టు చేశారు. మరికొందరు టీడీపీ నేతలను నల్లపాడు పీఎస్‌కు తరలించారు. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మాజీ మంత్రులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ విూడియాతో మాట్లాడుతూ హత్యకు గురైన రమ్య కుటుంబసభ్యులను పరామర్శించానని, వాళ్లతో మాట్లాడానన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 10 లక్షలు అవసరం లేదని, తమ కుమార్తెను తీసుకురావాలని వారు కోరుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా తాను ఇక్కడ ప్రెస్ విూట్ పెడితే వైసీపీ రౌడీలు వచ్చి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేయడం చాలా బాధాకరమన్నారు. పోలీసులు కూడా టీడీపీ నేతలపై దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. గతంలో వైసీపీ నాయకులు ఏమన్నారంటే.. గన్ కంటే ముందు జగన్ వస్తారని చెప్పారని.. జగన్ ఎక్కడ? గన్ ఏదీ అని లోకేష్ ప్రశ్నించారు. సొంత ఇంట్లో ఉన్న మహిళలకే సీఎం న్యాయం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళను దారుణంగా చంపేస్తే.. వాళ్లకు న్యాయం చేయలేని పరిస్థితిలో జగన్ ఉన్నారన్నారు. ప్రభుత్వం చేతగాని తనంవల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని లోకేష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్ధి రమ్య ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం నెకలొంది. వైసీపీ నేతలు వస్తున్నారంటూ టీడీపీ నేతలను పోలీసులు పక్కకు నెట్టివేసారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రజలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.