రాజకీయ కక్ష సాధింపు చర్యలకు భయపడం..
-సోనియా, రాహుల్ గాందీలపై ఈడీ కేసులకు తగిన గుణపాఠం చెబుతాం…
-రేపు ఈడీ కార్యాలయం ముట్టడికి పిలుపు..
-కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి..
గద్వాల రూరల్ జులై 20 (జనంసాక్షి):- కేంద్ర ప్రభత్వ అవినీతిని ఎండగట్టినందుకే ‘నేషనల్ హెరాల్డ్’ కేసు పేరిట ఈడీ దాడులతో సోనియా, రాహుల్ గాంధీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు..అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని వణుకు పుట్టిస్తున్న ఏఐసీసీ అధినేత్రి సోని యాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని ఇబ్బందులకు గురిచేయాలనే ప్రధాని నరేంద్ర మోదీ సుబ్రమణ్యస్వామిని పావుగా వాడుకుంటోందని వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు సీబీఐని వినియోగించుకుంటోందని దుయ్యబట్టారు. సోనియా, రాహూల్లపై కేసుల నమోదును వ్యతిరేకిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించనున్నారని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసును ఈడీ క్లోజ్ చేసినా మళ్లీ తెరవడం వెనక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. కేసులతో బయపెట్టాలనుకోవడం అవివేకమని, బ్రిటీష్ పాలకులను తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అధికారమదంతో సీబీఐని ప్రతి పక్ష పార్టీలపై ప్రయోగించడం సిగ్గు చేటన్నారు..కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రూట్ మ్యాప్ ఖరారైందని, మక్తల్ వద్ద యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి జుక్కల్ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తుందని ఇటీవల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల ప్రాతిపదికన ముక్కలుగా విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పటేల్ మండిపడ్డారు. బీజేపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. అనేక రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు సహా వివిధ వర్గాలపై జరుగుతున్న దాడులను ఎత్తిచూపేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని, దాదాపు 150 రోజులపాటు 3,600 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగనుందని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో యాత్రను అద్భుతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు సహా అన్ని అనుబంధ విభాగాలను యాత్రలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. దేశాన్ని కులమతాల పేరుతో విడగొట్టాలని చూస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యం చేయడమే ఈ యాత్ర ముఖ్యోద్దేశమని వివరించారు. ఇవన్నీ జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందోనని భయపడి కేంద్రం ఈడీ కేసులను తిరగదోడుతోందని మండిపడ్డారు. దీనికి నిరసనగా రేపు జోగుళాంబ గద్వాల్ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి పిలుపుమేరకు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పటేల్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Attachments area
|